టీటీడీ పాలకమండలి కీలక భేటీ- క్యూ లైన్లల్లో భారీ మార్పులకు ఛాన్స్ ..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 70,842 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,125 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుండి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు. ఈ పరిస్థితుల మధ్య తాజాగా టీటీడీ పాలకమండలి సమావేశమైంది. తిరుమల అన్నమయ్య భవన్ లో ఈ భేటీ కొనసాగుతోంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

సుమారు 100కు పైగా అంశాలు ఈ సందర్భంగా పాలకమండలి సమావేశంలో చర్చకు రానున్నాయి. వీటిపై క్షుణ్ణంగా చర్చించిన అనంతరం వాటి తీర్మానాలను ఆమోదించనున్నారు. శ్రీవారి దర్శనాల నిర్వహణలో ఆర్టిఫీషీయిల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై భవిష్యత్ కార్యాచరణపై టీటీడీ పాలక మండలి చర్చించనుంది. ఏఐని వినియోగించడం వల్ల సామాన్య భక్తులకు కూడా గంట నుండి రెండు గంటల్లో శ్రీవారి దర్శనాన్ని కల్పించవచ్చని టీటీడీ అభిప్రాయపడుతోంది. దీనిపై పాలకమండలి సభ్యులు చర్చించనున్నారు.
అలాగే- శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో మార్పులపై చర్చించనున్నారు. శ్రీవాణి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేయడానికి వీలుగా తిరుమలలో కొత్తగా దర్శనం టికెట్ల కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. శ్రీవాణి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను జారీ చేయాలని టీటీడీ పాలక మండలి గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇదివరకే ఓ కేంద్రం ఇక్కడ ఏర్పాటైంది.
తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా ఏర్పాటైన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని అప్పట్లో బీఆర్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దీని నిర్మాణం కోసం టీటీడీ 60 లక్షల రూపాయలను వ్యయం చేసింది. ఇటువంటి కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయడం, దర్శన టికెట్ల జారీలో మార్పులు చేర్పులు చేయడం వంటివి.. ఈ సందర్భంగా పాలకమండలి సమావేశంలో చర్చకు రానున్నాయి.
1. వైకుంఠ ద్వార దర్శనాల రోజులు కుదింపుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2. శ్రీవారి దర్శనాల నిర్వహణలో ఆర్టిఫీషీయిల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై భవిష్యత్ కార్యాచరణ
3. శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో మార్పులపై చర్చ
4. ఒంటిమిట్టలో 100 గదులతో భారీ వసతి సముదాయం నిర్మాణం
5. టీటీడీ ఆసుపత్రులకు ఒకే డైరెక్టర్ నియామకం
6. వీఐపీ గదుల అద్దెలపై క్రమబద్ధీకరణ కమిటీ ఏర్పాటు
7. దాతల ప్రివిలేజెస్ పై సమీక్ష, ఇందులో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు
8. తిరుమలలో దివ్య ఔషధ వనం ఏర్పాటు
9. గోశాలల నిర్వహణను అనుభవం ఉన్న సంస్థకు కేటాయించాలనే ప్రతిపాదన.. వంటివి టీటీడీ పాలక మండలి సమావేశం అజెండాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications