ఏపీలో విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరు ? నిఘా వైఫల్యాన్ని మించిన కారణం ? అదేనా
ఏపీ గుళ్లలో విగ్రహాల ధ్వసం నిరాటంకంగా కొనసాగుతోంది. గతేడాది బిట్రగుంటలో రథం దగ్ధానికి మందు మొదలైన ఈ అరాచకాల పర్వం రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంది. కొన్ని నెలలుగా వరుస విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా చెప్పుకోదగిన స్ధాయిలో చర్యలు లేకపోవడం, నిందితులను గుర్తించడం, శిక్షించే విషయంలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం, అంతిమంగా నిఘా వైఫల్యం వైసీపీ సర్కారు ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. అయినా ఇప్పటికీ వీటిపై ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడుతుండటం విపక్షాలకు వరంగా మారుతోంది. అసలేం జరుగుతోందన్న ప్రశ్న సాధారణ ప్రజల్ని సైతం వేధిస్తోంది.

కొత్త ఏడాదిలోనూ ఆగని విగ్రహాల ధ్వంసం
ఏపీలో గతేడాది మొదలైన దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది. గతేడాది చివర్లో విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాములోరి విగ్రహం తల నరికిన వ్యవహారం సద్దుమణగకముందే డిసెంబర్ 31 అర్ధరాత్రి అంటే తెల్లారితే జనవరి 1న రాజమండ్రిలో మరో విగ్రహం ధ్వంసమైంది. నగరంలోని వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో విశాఖ మన్యం పాడేరులో గ్రామదేవత కొమాలమ్మ విగ్రహ పాదాలను ఎవరో ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

తీవ్ర నిఘా వైఫల్యం
రాష్ట్రంలో గతేడాది అంతర్వేది రథం దగ్ధం ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. అంతకుముందే బిట్రగుంటలోనూ రథం దగ్ధమైంది. వందల సంఖ్యలో గుళ్లలో విగ్రహాల ధ్వంసం కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది. అయితే ఇలా మాస్ హిస్టిరియీ తరహాలో సాగుతున్న ఈ ఘటనలను గుర్తించడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలమైంది. కనీసం ముందుగా తెలుసుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్ధితీ కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్దితిలోకి వెళ్లిపోతోంది. రాష్ట్రంలో వరుసగా విగ్రహాల ధ్వంసం కొనసాగుతున్నా, ఏడాది నుంచి ఈ విధ్వంసం సాగుతున్నా నిందితులెవరో గుర్తించలేకపోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో సైతం ఇదే తొలిసారని చెప్పవచ్చు.

నిందితులపై చర్యలకు వెనకడుగు
రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం నిజం. అందులో నిఘా వైఫల్యం అంతకంటే నిజం. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో వెనకాడుతుండటం కూడా అంతే నిజంగా కనిపిస్తోంది. ఇన్ని గుళ్లలో విగ్రహాల ధ్వంసం జరిగితే ఇందులో కనీసం కొందరి పాత్ర అయినా నిరూపించే ఆధారాలు లభించలేదని అధికారులు కానీ, ప్రభుత్వం కానీ సమర్ధించుకోగలదా ? ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్లుగా వదిలేయడం వల్లే ఇవి మరింతగా పెరిగిపోతున్నాయనేది నిజం కాదా ? అంతిమంగా ఎవరి లబ్ధి కోసమే జరుగుతున్న రాజకీయానికి వైసీపీ సర్కారు ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోవాలని భావిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రామతీర్ధం ఘటన తర్వాత మాత్రం సీఎం జగన్ నిందితులపై చర్యలు తప్పవని చేసిన హెచ్చరిక వారిపై ఏమాత్రం పనిచేయలేదని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి.

సర్కారు భయం అందుకేనా ?
ఏపీలోని పలు దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం చర్యలు తీసుకుంటే నిందితులు బహిర్గతం అవుతారు. వారి మతం ప్రధానంగా మారిపోతుంది. అంతిమంగా మత విద్వేషాలకు బీజం పడుతుందని జగన్ సర్కారు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. కనీసం నిందితులను కోర్టుల్లో హాజరుపరిచి వారికి శిక్షలు విధించే విషయంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో జగన్ సర్కారు బలహీనతను ఆసరాగా చేసుకుని నిందితులు చెలరేగిపోతున్నారు.