జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన ఆ అధికారికి కేంద్రంలో కీలక పదవి..
ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు మాజీ సీఈవో,ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్‌కు కేంద్రం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.రాష్ట్ర సర్వీసుల నుంచి సస్పెండ్ అయి కేంద్ర విధుల్లో చేరిన కొద్ది కాలానికే ఆయనకు పదోన్నతి లభించడం గమనార్హం.
టీడీపీ ప్రభుత్వ హయంలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవోగా కృష్ణ కిశోర్ పనిచేశారు. ఆయన కారణంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మొదటి ర్యాంకులు సాధిస్తూ వచ్చింది. అయితే సీఈవో హోదాలో ఆయన అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. ఆయనపై కేసులు నమోదు చేసి విచారణకు కూడా ఆదేశించారు. అయితే కృష్ణ కిశోర్ క్యాట్‌ను ఆశ్రయించడంతో ఊరట లభించింది. కృష్ణ కిషోర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసిన క్యాట్... కేంద్ర సర్వీసుల్లో తన సొంత శాఖకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన కేంద్ర విధుల్లో చేరగా.. తాజాగా ఐటీ ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ పదోన్నతి దక్కడం విశేషం.

Recommended Video
కృష్ణ కిశోర్‌పై ఉన్న కేసుల దర్యాప్తు కొనసాగించవచ్చునని క్యాట్ గతంలోనే స్పష్టం చేసింది.దీంతో ఆ కేసుల దర్యాప్తు కొనసాగనుంది. కృష్ణ కిశోర్ సస్పెన్షన్ వ్యవహారం ఏపీలో రాజకీయంగానూ దుమారం లేపింది. చంద్రబాబుకు సన్నిహితుడు అన్న కారణంగానే ఆయనపై అభియోగాలు మోపారని టీడీపీ ఆరోపించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సస్పెండ్ చేశారని ఆరోపించింది. అయితే ప్రభుత్వం మాత్రం నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ఆయన్ను విధుల నుంచి తొలగించింది.












Click it and Unblock the Notifications