బెడిసికొట్టిన రుషికొండ ప్లాన్: టీడీపీకి బూమరాంగ్: గంటా అత్యుత్సాహం?
Rushikonda Buildings: విశాఖపట్నం సమీపంలోని రుషికొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారం.. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడినట్టయింది కూటమికి. దీనికి కారణాలు లేకపోలేదు.
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇటీవలే రుషికొండ భవనాలను మందీ మార్బలం, మీడియాతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయతో కట్టించారని, అందులో 26 లక్షల రూపాయల విలువ చేసే బాత్ టబ్ ఉందంటూ టీడీపీ సైతం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి దీన్ని ట్వీట్ చేసింది.

ఈ భవనాలను సందర్శించే విషయంలో గంటా శ్రీనివాస్‌పై పార్టీ అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. నిజానికి- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్- స్వయంగా ఈ భవనాల తాళాలను తీయాలని తొలుత భావించినట్లు చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, పార్టీ నాయకులు, మీడియాతో కలిసి వారిద్దరూ రుషికొండ భవనాలను అణువణువూ తిలకించాలని, అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి వివరించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందుగా ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
అంతకంటే ముందే గంటా శ్రీనివాస్ ఈ భవనాల తలుపులు తీయడం, మీడియాను వెంటబెట్టుకుని ప్రతి గదినీ తిలకించడం.. చకచకా సాగిపోయింది. ఇది కాస్తా చంద్రబాబు, కూటమి పెద్దలకు అసహనాన్ని కలిగించిందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై గంటా శ్రీనివాస్ నుంచి వివరణ సైతం కోరినట్లు చెబుతున్నారు.

పైగా- ఈ భవనాలను వైఎస్ఆర్సీపీ నాయకులు.. 2014- 2019 మధ్యకాలంలో చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయంతో పోల్చడం మరింత డ్యామేజ్ చేసిందనే భావన కూటమి పెద్దల్లో ఉందని అంటున్నారు.
గతంలో భారీ వర్షాలకు సచివాలయం కుంగిపోవడం, చూరు కారడం, మంత్రుల ఛాంబర్లల్లో వర్షపు నీరు ప్రవహించడానికి సంబంధించిన ఫొటోలను వెలికి తీసి మరీ.. జగన్ ప్రభుత్వంలో కట్టిన రుషికొండ భవనాలతో వైఎస్ఆర్సీపీ పోల్చడాన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేసిందని చెబుతున్నరు.












Click it and Unblock the Notifications