బయట మీసం మెలేసి, లోన రేవంత్ రెడ్డి ఏడ్చేశారా?
హైదరాబాద్: ఎసిబి అధికారులు అరెస్టు చేసి తమ కార్యాలయానికి తీసుకుని వచ్చిన సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఆదివారం సాయంత్రం మీసం మెలేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. కెసిఆర్‌ను గద్దె దించి, ఆయనను ఇదే పోలీసుల చేత అరెస్టు చేయించి ఈడ్చుకుని వచ్చేలా చేస్తానని ఆయన అన్నారు.
అత్యంత పకడ్బందీగా ఎసిబి అధికారులు వల పన్ని పక్కా సాక్ష్యాలతో తనను అరెస్టు చేశారనే విషయం తెలియక ఆయన ఆ విధంగా మాట్లాడి ఉంటారని తర్వాత అందరూ భావించారు. ఆయన ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌తో నడిపించిన డీల్ అంతా టీవీ చానెళ్లలో ప్రసారమైన తర్వాత పరిస్థితి అంత సులభంగా లేదని ఆయన కూడా గ్రహించే ఉంటారు.

రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్‌కు అరచేతిలో స్వర్గం చూపిస్తూ వచ్చారు. హామీల మీద హామీలు కురిపిస్తూ వచ్చారు. తాను ఎక్కడ ఉన్నాను, మరు క్షణంలో ఏమవుతాను, ఏం జరుగుతుందనే విషయం తెలియని రేవంత్ రెడ్డి తన బాసే ఇదంతా చేయమన్నారని, రెండున్నర కోట్లు ఇవ్వడానికి తనకు బాస్ అనుమతి ఇచ్చారని చెప్పేశారు. దీంతో ఆయన మాత్రమే కాకుండా ఆయన బాస్ కూడా చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది.
అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఆదివారం రాత్రి ఎసిబి కేంద్ర కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఏడ్చేశారని మీడియా కథనాలు వచ్చాయి. ఐదు కోట్లకు స్టీఫెన్ సన్ వద్ద బేరమాడి, ఐదు లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించే సమయంలో రేవంత్ రెడ్డి వద్ద ఉన్న ఫోన్‌ను టీవీల్లో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కనీసం ఆ ఫోన్ వేయి రూపాయలు కూడా చేయదు. ఏమైనా, రేవంత్ రెడ్డి చాలా కాలంగా కెసిఆర్‌కు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూనే ఉన్నారు.
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిని తానే అని ఇటీవల ఓ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారు. అందుకు అవసరమైన సామాజిక లెక్కల గురించి కూడా వివరించారు. తెలుగుదేశం పార్టీలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మెట్లు ఎక్కే ఆతురత, దాహం కారణంగానే రేవంత్ రెడ్డి పాము నోటికి చిక్కారా అనేది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications