చంద్రబాబుపై ఫైర్: రోజా సహా ప్రతిపక్షాల నేతలను వేధిస్తున్నారా?
విజయవాడ: అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల నాయకులను పద్ధతి ప్రకారం వేధిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ నాయకులను, శాసనసభ్యులను కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేధిస్తున్నారని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ శాసనసభ్యులను కాపాడుతూ తన వారిని మాత్రం వేధిస్తున్నారని అంటున్నారు.
తాజాగా కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణు వ్యవహారంలో అదే విమర్శి వినిపిస్తోంది. స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో ఆయనను తొమ్మిదో నిందితుడిగా చేర్చారు. అయితే, స్వర్ణ బార్ ఆయన పేరు మీద లేదని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. అయినప్పటికీ ఆయనపై కేసు పెట్టి, వేధిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు.
మల్లాది విష్ణు 600 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నారని కల్తీ మద్యం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ గుర్తించి ఆ వ్యవహారాన్ని ఈడికి అప్పగించినట్లు తెలుస్తోంది. కావాలని అధికార పార్టీ తనను వేధిస్తోందని మల్లాది విష్ణు విమర్శిస్తున్నారు. ఇసుక మాఫియా వ్యవహారం కూడా తేల్చాలని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కున్న టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వంటివారి ఆస్తులపై కూడా విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అధికార పార్టీ తప్పిదాలపై గట్టిగా మాట్లాడుతున్న తమ శాసనసభ్యులను తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. తిరుపతి విమానాశ్రయంలో సిబ్బందిపై దాడి చేశారనే ఆరోపణపై కేసు నమోదు చేసి తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిని వేధిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.
అలాగే, చంద్రబాబు ప్రభుత్వం తప్పులపై పోరాటం చేస్తుండడం వల్లనే తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని అంటున్నారు. తమను సూటిగా ప్రశ్నిస్తున్న నాయకులను అధికార పార్టీ లక్ష్యం చేసుకుంటోందని అంటున్నారు. మరో కాంగ్రెసు శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రైలు దగ్ధం కేసులో అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆ సంఘటన చోటు చేసుకుంది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు కూడా అధికార పార్టీ కుట్రలో భాగంగానే జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే, ఆ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు వాదిస్తున్నారు. మొత్తం మీద, కావాలని ప్రతిపక్షాల నాయకులను, శాసనసభ్యులను లక్ష్యం చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ వేధిస్తోందనే విమర్శలు పెద్ద యెత్తున వస్తున్నాయి.












Click it and Unblock the Notifications