ys jagan ysrcp delhi narendra modi devineni uma maheswara rao వైయస్ జగన్ ఢిల్లీ నరేంద్ర మోడీ దేవినేని ఉమామహేశ్వర రావు politics
వైఎస్ జగన్ ఢిల్లీ టూర్: ప్రధాని మోడీతో కీలక భేటీ, మంత్రి పదవులకోసమేనా? అంటూ టీడీపీ
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం చేరుకున్న సీఎం జగన్.. అక్కడ్నుంచి ఢిల్లీకి వెళ్లారు. విమానాశ్రయం నుంచి తన నివాసానికి చేరుకున్నారు.

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, మోపిదేవి వెంకటరమణ, బాలశౌరిలు ఉన్నారు. ప్రధానితో సమావేశం ముగిశాక ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు.

కీలక అంశాలపై చర్చ
కాగా, కేంద్రమంత్రి వర్గంలో వైయస్సార్సీపీ చేరుతోందంటూ ప్రచారం జరుగుతున్నవేళ ప్రధానితో సీఎం జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ భేటీలో విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం పెండింగ్ నిధులు, రాజధానుల వ్యవహారం, తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

జగన్‌కు ఆ ధైర్యం ఉందా?
ఇది ఇలావుండగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రివర్గంలో పదవుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. కేంద్ర పెద్దలతో ఏం చర్చించారో ఢిల్లీ మీడియా ముందు చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి పదవుల కోసమేనా?
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కారు ధ్వంసమైన నేపథ్యంలో మంగళవారం ఆయన్ను కలిసి వివరాలు అడిగితెలుసుకున్నారు. పట్టాభి కారుపై దాడి పిరికిపంద చర్యని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నారనే కక్షతోనే ఈ దాడి చేశారంటూ మండిపడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగానైనా దోషులను పట్టుకోలేకపోయారని పోలీసులపై ధ్వజమెత్తారు. జగన్ ఢిల్లీ పర్యటన.. కేంద్రమంత్రి పదవుల కోసమా? లేక కేసుల మాఫీ కోసమా? అని దేవినేని నిలదీశారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు ఇప్పుడు తమ వల్లకాదంటూ చేతులెత్తేశారని విమర్శించారు.