గుడివాడ క్యాసినో : కొడాలి నాని - వంశీ పై టీడీపీ ఫిర్యాదులు : ఐటీ నోటీసులు..!!
కొద్ది నెలల క్రితం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైన గుడివాడ క్యాసినో వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడలో అప్పటి మంత్రి కొడాలి నాని - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇదే వ్యవహారం పైన కేంద్రం నుంచి విచారణ సంస్థల వరకు ఫిర్యాదులు చేసింది. టీడీపీ నిజ నిర్దారణ కమిటీ గుడివాడలో పర్యటించింది. ఇప్పుడు టీడీపీ ఫిర్యాదుల పైన ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. నోటీసులు జారీ చేసింది.

గుడివాడ క్యాసినో పై ఐటీ ఆరా..
గత ఏడాది గుడివాడలో నాటి మంత్రి కొడాలి నాని - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్యాసినో నిర్వహించారని టీడీపీ ప్రచారం చేసింది. గుడివాడలో మంత్రికి చెందిన ఫంక్షన్ హాల్ లో దీనిని నిర్వహించారని టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. పార్టీ నుంచి నిజ నిర్దారణ కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గుడివాడలో పర్యటించిన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక, ఇదే సమయంలో టీడీపీ నేతలు ఈ వ్యవహారం పైన రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదులు చేసారు. ఆదాయపు పన్ను శాఖ, ఈడీ, డీఆర్ఐ తో పాటుగా కేంద్ర ఆర్దిక, హోం శాఖ కు ఫిర్యాదులు చేసారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు టీడీపీ చేసిన ఫిర్యాదుల పైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పందించారు. పూర్తి సమాచారం కావాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు.

టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు
టీడీపీ నుంచి చేసిన ఫిర్యాదు మేరకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగా క్యాసినోకు సంబంధించి పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో, ఇప్పుడు వర్ల రామయ్య గుడివాడలో క్యాసినోకు సంబంధించి సేకరించిన సమాచారంతో ఐటీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. వర్లతో పాటుగా ఫిర్యాదు దారులుగా ఉన్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొడాలి నాని - వల్లభనేని వంశీ మాత్రం గుడివాడలో క్యాసినో జరగలేదని స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతి కావటంతో కోడి పందేలు నిర్వహించారని, ఎక్కడా క్యాసినో ఆనవాళ్లు లేవని తేల్చి చెబుతున్నారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను రుజువు చేస్తే దేనికైనా సిద్దమని గతంలోనే కొడాలి నాని స్పష్టం చేసారు.

ఆధారాలు సమర్పించాలి - విచారణకు రావాలి
టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా మూడ్రోజుల పాటు కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించారనీ.. దాదాపు 500కోట్ల రూపాయలు చేతులు మారాయనీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు టీడీపీ నేతలు వివరించారు. ఇప్పుడు ఆధారాలతో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు వర్ల రామయ్య ఐటీ అధికారులకు ఎటువంటి ఆధారాలు ఇస్తారు.. వాటిని చూసిన తరువాత ఐటీతో పాటుగా విచారణ సంస్థలు ఏ విధంగా ముందుకెళ్తాయనేది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ ను పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications