ఓర్వలేకనే కుట్రలు: బాబుపై జగదీశ్వర్, నాయక్ ఫైర్
హైదరాబాద్: కరెంటు విషయంలో ఆంధ్రా నేతలు చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోలుకు సిఎం కె చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బోర్డు నిర్ణయం మార్చుకోకపోతే తాము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణ రైతులను, పరిశ్రమలను కాపాడుకుంటామని అన్నారు. శ్రీశైలం జలాల నుంచి నవంబర్ 2వ తేదీ లోపు విద్యుత్ ఉత్పత్తికి 3టిఎంసిలే వాడుకోవాలని బోర్డు సూచించిన విషయం తెలిసిందే.
ఏపి కుట్రలకు కేంద్రం వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. కరెంటు కోతలకు టిడిపి, బిజెపి నేతలే బాధ్యత వహించాలని జగదీష్ డిమాండ్ చేశారు. ఐఏఎస్‌ల కేటాయింపులో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల కొరత వల్లే పాలన జాప్యం అవుతోందని తెలిపారు.

ఓర్వలేకనే కుట్రలు: బాబుపై రెడ్యా నాయక్
వరంగల్: సిఎం కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకనే ఏపి సిఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ నేతలు ఆరోపణలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కెసిఆర్ పాటు పడుతుంటే కాంగ్రెస్, టిడిపిలు ఉనికి కోసం పాకులాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు పట్టణాల్లో రింగురోడ్లు: డిప్యూటీ సిఎం రాజయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని డిప్యూటీ సిఎం రాజయ్య తెలిపారు. రోడ్ల అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ పట్టణాలకు రింగ్ రోడ్ నిర్మించనున్నట్లు చెప్పారు.
ఐఆర్సీ నాణ్యతా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. రోడ్ల పరిస్థితులను అంచనా వేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. 15రోజుల్లో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. నవంబర్ 7న మరోసారి భేటీ అవుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications