అనపర్తి ఘటనపై చర్యలు మొదలు-చంద్రబాబుపై సహా 8 మందిపై కేసు !
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టూర్ లో భాగంగా అనపర్తిలో చేసిన హంగామాపై వైసీపీ సర్కార్ చర్యలకు దిగింది. ముఖ్యంగా అనపర్తిలో పోలీసుల ఆంక్షల్ని ఉల్లంఘించి దేవీ చౌక్ లో సభ నిర్వహించిన వ్యవహారంలో చంద్రబాబుతో పాటు 8 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసుల వ్యవహారం కలకలం రేపుతోంది.
నిన్న అనపర్తిలోని దేవీ చౌక్ లో చంద్రబాబు సభ నిర్వహణకు పోలీసులు ముందుగా అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత చివరి నిమిషంలో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే సభకు అనుమతి రద్దు చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. చంద్రబాబు అయితే తన వాహనం అనుమతివ్వకపోవడంతో కాలి నడకన ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి దేవీచౌక్ లో సభ పెట్టారు. దీంతో డీఎస్పీ భక్తవత్సల ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు మొత్తం 8 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదుచేసినట్లు తెలుస్తోంది.

పోలీసు యాక్ట్, జీవో నంబర్ 1 ఉల్లంఘించి అనుమతులు లేకపోయినా అనపర్తిలో రోడ్డుపై సభ పెట్టినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు చినరాజప్ప, జవహర్ తో పాటు పలువురు నేతలు, దాదాపు వెయ్యిమంది వరకూ కార్యకర్తలపైనా కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి ఘటనలపై స్పందించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ రెడ్డి.. విపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు ఉల్లంఘించి అనపర్తిలో సభ పెట్టారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలిపారు.













Click it and Unblock the Notifications