ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-జోనల్ వ్యవస్ధ విభజన-ఇక రెండు మల్టీ జోన్లలో ఆరు జోన్లు...
ఏపీలో పాలనా సౌలభ్యం పేరుతో గతంలో 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా మార్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల నియామకాలు, బదిలీల్లో కీలకమైన జోన్లలోనూ పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న నాలుగు జోన్ల స్ధానంలో ఆరు జోన్లను ప్రతిపాదిస్తోంది. ఇందుకు సంబంధించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఉద్యోగ సంఘాలు పలు ప్రతిపాదనలు చేశాయి.
ఏపీలో జోన్ల విభజనకు సంబంధించి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి పి.భాస్కర్ తాజాగా భేటీ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆప్షన్లను వారి ముందు ఉంచారు. ఇందులో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆరు జోన్ల వ్యవస్ధను స్వాగతించాయి. అలాగే ఇందులో చేపట్టాల్సిన పలు మార్పుల్ని కూడా సూచించాయి. వీటిని లిఖిత పూర్వకంగా అందించాలని ప్రభుత్వం వారిని కోరింది.

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నఆరు జోన్ల వ్యవస్ధలో అల్లూరి సీతారామరాజు జిల్లాను కాకినాడ జోన్ లో పెట్టగా.. దీనిపై ఉద్యోగ సంఘాల అభ్యంతరాలతో దీన్ని విశాఖ జోన్ లో పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే తిరుపతి జిల్లాను నెల్లూరు జిల్లాలో పెట్టగా.. దీన్ని వైఎస్సార్ జోన్ లో ఉంచాలన్న ఉద్యోగ సంఘాల అభ్యర్ధనను కూడా పరిశీలిస్తోంది. తాజా మార్పుల ప్రకారం ఆరు జోన్లతో పాటు రెండు మల్టీ జోన్ లు కూడా ఏర్పాటవుతున్నాయి. అలాగే రాష్ట్రస్ధాయి కేడర్ లేకుండా రాజధాని ప్రాంతంలోకి వచ్చే రాష్ట్రస్ధాయి ఆఫీసుల్లో పనిచేసే వారి కోసం మల్టీజోన్ ఏర్పాటు కానుంది.
తాజా మార్పుల ప్రకారం జూనియర్ అసిస్టెంట్ పోస్టులపైన ఉన్న అన్ని పోస్టుల్ని జోనల్ పోస్టులుగా గుర్తిస్తారు. అలాగే తహసీల్దార్ క్యాడర్ ను మించిన పోస్టుల్ని మల్టీ జోన్ లోకి చేరుస్తారు. జిల్లా, జోన్, మల్టీ జోన్ పోస్టుల్లో 95 శాతం స్ధానికులకు, మిగిలిన 5 శాతం స్ధానికేతరులకు కేటాయిస్తారు. ప్రతిపాదిత జోన్లలో ఒకటో మల్టీ జోన్ పరిధిలోకి 1,2,3 జోన్లు వస్తాయి. రెండో మల్టీ జోన్ లోకి 4,5,6 జోన్లు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఒకటో జోన్ లోకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు వస్తాయి. అలాగే రెండో జోన్ లోకి అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు వస్తాయి. మూడో జోన్ లోకి పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు వస్తాయి. నాలుగో జోన్ లోకి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, ఐదో జోన్ లోకి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలు, ఆరో జోన్ పరిధిలోకి నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications