ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు: జీతంతో పాటు ఆ డబ్బులు కూడా!!
ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఎంతో కష్టించి ప్రజా రవాణా వ్యవస్థలో పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అందులో భాగంగా రాత్రి సర్వీసులలో విధులు నిర్వర్తించే ఆర్టీసీ డ్రైవర్లకు , కండక్టర్ లకు నైట్ ఔట్ భత్యాలను జీతంతో కలిపి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఆర్టీసీ ప్రభుత్వ శాఖలో విలీనం కాక ముందు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లకు జీతం ఇచ్చినప్పుడే ఈ భత్యం కూడా ఇచ్చే విధానం ఉండేది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు చెల్లింపు చేయటం మొదలైన నాటి నుండి ఈ విధానం ఆగిపోయింది. అయితే దీనిపై ప్రభుత్వానికి ఉద్యోగులు పదేపదే విజ్ఞప్తి చేశారు.

దీంతో స్పందించిన జగన్ సర్కార్ ఈమేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర పరిధిలో సాయంత్రం 6 గంటల నుండి అర్దరాత్రి 12 గంటల మధ్య నైట్ ఔట్ విధులకు వెళ్ళే వారికి 150రూపాయలు, అలాగే 12 గంటలకు పైగా విధుల్లో ఉంటే 300రూపాయలు చొప్పున చెల్లిస్తారు. అంతేకాదు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే రాత్రి సర్వీసులు నడిపే వారికి 200 రూపాయల నుండి 400రూపాయల వరకు చెల్లింపు చేయనున్నారు.
ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, తమ విజ్ఞప్తి పై సానుకూలంగా జగన్ సర్కార్ స్పందించటం పట్ల కార్మిక సంఘాల నాయకులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాల పట్ల ఎన్ఎంయూఏ, ఈయూ హర్షం వ్యక్తం చేశాయి. అయితే నైట్ ఔట్ భత్యానికి సంబంధించి దాదాపు 20 నెలల బకాయిలు వున్నాయని, వాటిని అన్నింటినీ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డే ఔట్ విధులకు వెళ్ళే వారికి కూడా భత్యాలు చెల్లించాలని ఎన్ఎంయూఏ, ఈయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ భత్యాలను జీతంతో పాటు అకౌంట్ లో జమ చేయనున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.












Click it and Unblock the Notifications