Manipur riots:చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు..!
Manipur riots:మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 157 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్ లో చదువు తున్నట్టు గుర్తించారు.
మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీలలో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్ధిని నోడల్ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారిద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్ధుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. విద్యార్ధులను ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి పౌరవిమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు.

ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు.ఒకవైపు పౌరవిమానయానశాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రయివేటు విమానయాన సంస్ధలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు.
ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్ధతో అధికారులు సంప్రదిస్తున్నారు.ఇక విద్యార్థులంతా నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీల్లో చదువుతున్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లతో విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అయితే ఇంఫాల్ వెస్ట్ జిల్లా కలెక్టర్ కర్ఫ్యూ వేళ్లల్లో సడలింపు ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సడలింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో అక్కడి ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాల్సిందిగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications