జగన్ మార్క్ కేబినెట్: సాయిరెడ్డి-సుబ్బారెడ్డి దూరంగా : బొత్సా టీం కు ప్రయార్టీ- పీకే సైతం...!!
ఏపీ సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు తరువాత కేబినెట్ ఖరారు చేసారు. కొన్ని పేర్లు చివరి నిమిషంలో చేర్చారు. అదే విధంగా కొందరు సీనియర్లు పదవుల కోసం వెయిట్ చేస్తున్నా.. సామాజిక సమీకరణాలతో ఆ పేర్లు పక్కన పెట్టారు. పూర్తిగా 2024 ఎన్నికల కోసమే ఈ కేబినెట్ అని స్పష్టం చేస్తున్నారు. అయితే, తొలి సారి కేబినెట్ కూర్పులో జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి..వైవీ సుబ్బారెడ్డి లాంటి వారు తమ వంతు పాత్ర పోషించారు. కానీ, ఇప్పుడు మాత్రం వారికి ఎటువంటి జోక్యం లేదని తెలుస్తోంది.

జగన్ మార్క్ కూర్పులో మార్పులు
ప్రకాశం జిల్లాలో బాలినేనిని పక్కన పెట్టటం వెనుక అనేక రకాలుగా చర్చలు సాగుతున్నా... అది సామాజిక సమీకరణాల్లో భాగంగానే జరిగిందని ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బాలినేని జగన్ కు బంధువు. జగన్ కోసం మంత్రి పదవి సైతం నాడు వదులుకున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఆయనతోనే ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన సాయిరెడ్డి పూర్తిగా మౌనం పాటించారు. విస్తరణ సమయంలో దూరంగానే ఉన్నారు. అయితే, సీనియర్ మంత్రులు బొత్సా - పెద్దిరెడ్డి మాత్రం ఈ టీం కూర్పులో ప్రభావం చూపించారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. తొలుత నలుగురు లేదా అయిదుగురు అందులోనూ సామాజిక సమీకరణాల ఆధారంగానే పాత మంత్రులను కొనసాగిస్తారని ప్రచారం సాగింది.

బొత్సా - పెద్దిరెడ్డికి పార్టీ -ప్రభుత్వంలో పెద్దరికం
కానీ, అనూహ్యంగా అనుభవం అనే అంశం తెర మీదకు వచ్చింది. దీంతో.. పార్టీలో ఉత్తరాంధ్రలో బొత్సా..రాయలసీమలో పెద్దిరరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. విస్తరణ సమయంలో బొత్సా వారసుడిగా జిల్లా నుంచి ఎవరికి ఇవ్వాలనే అంశం పైన అభిప్రాయం తీసుకున్నట్లు తెలిసింది. పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా సమీకరణాల పైన సీఎంకు స్పష్టంగా తన అభిప్రాయం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటుగా ఎన్నికల టీం గా ఎంపిక చేస్తున్న సమయంలో పార్టీలోనే కాకుండా.. ప్రభుత్వంలోనూ సమర్ధత - అనుభవం అవసరమని నిర్ణయించారు. ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదికలను సైతం పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే క్రిష్ణా - అనంతపురం - చిత్తూరు జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో సమీకరణాలు మారాయని తెలుస్తోంది. బొత్సా కు ఉత్తరాంధ్ర బాధ్యతలు అధికారికంగా అప్పగించేందుకు రంగం సిద్దమైంది.

పదవులు దక్కని వారి విషయంలో
ఇక, బొత్సాతో అత్యంత సన్నిహితంగా ఉండే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కటం ద్వారా..సామాజిక సమీకరణాలే కారణమని చెబుతున్నా..బొత్సా టీంకు ప్రయార్టీ దక్కిందనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఇక, చిత్తూరు..గుంటూరు..ఉభయ గోదావరి జిల్లాలకు మూడు చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. ప్రకాశం..అనంతపురం జిల్లాకు మాత్రం ఒకటే మంత్రి పదవి దక్కింది. అవకాశం దక్కని సీనియర్ నేతల అనుచరులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు. సీనియర్ నేతలు సైతం లోలోపల రగిలిపోతున్నారు. వారు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications