జమిలి వేళ.. జగన్ గ్రీన్ సిగ్నల్..!!
YS Jagan Mohan Reddy: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం క్రమంగా కోలుకుంటోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి వంటి కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది.
వన్ నేషన్- వన్ ఎలక్షన్..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.

పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి
ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలో రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పని చేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ- వాళ్లు పర్యవేక్షించిన ప్రాంతాలు మారాయి.
నేడు విస్తృత సమావేశం
వాళ్లందరితో వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది. రీజినల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ విస్తృత సమావేశానికి హాజరు కానున్నారు.
కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..
బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి జగన్ ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ క్రమంలో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోన్న నాయకులు, కార్యకర్తలతో వాటిని భర్తీ చేయనున్నారు.

కూటమి సర్కార్‌పై రణం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లనున్నారు జగన్. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయాంపై ఆందోళనలు కొనసాగించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.
విద్యుత్ ఛార్జీల భారంపై..
జనంపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం, ధాన్యం సేకరణలో విఫలం కావడం, సేకరిస్తోన్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం, ప్రభుత్వం రైతులను వంచిస్తోన్న పరిణామాలపై గ్రామస్థాయిలో మున్ముందు నిర్వహించదలిచిన ఉద్యమాలు, పోరాటాలపై జగన్ వారికి దిశానిర్దేశం చేస్తారు.
విద్య, వైద్య రంగాలపై..
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటోన్న సమస్యల.. ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చకు రానున్నాయి.












Click it and Unblock the Notifications