టెన్త్, ఇంటర్ ఫెయిల్యూర్స్ కు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ..!
ఏపీలో గతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కాలంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో ఆఫర్ ఇచ్చింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న కారణంతో విద్యార్ధులు చేసుకుంటున్న ఆత్మహత్యలను నివారించేందుకు, ఇతరత్రా కారణాలతో వారికి కొత్త ఆఫర్ ప్రకటించింది. దీంతో వారు ఆత్మన్యూనతా భావానికి గురి కాకుండా ఉండేందుకు అవకాశం దక్కినట్లయింది.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్ మీడియట్ పరీక్షలు, అలాగే వాటి అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో సైతం ఫెయిలైన వారి కోసం ప్రభుత్వం తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం వారు ఇకపై పరీక్షల్లో ఫెయిలైనప్పటికీ తరగతులకు హాజరై తిరిగి చదువుకుని పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు. సాధారణంగా అయితే ఈ పరీక్షల్లో ఓసారి ఫెయిలైతే తిరిగి క్లాసులకు హాజరయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం సానుకూల దృష్టితో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఇలా టెన్త్, ఇంటర్ పరీక్షలు ఫెయిలైన తర్వాత కూడా కాలేజీలకు వెళ్లి చదువుకోవాలని భావించే విద్యార్ధులకు ప్రభుత్వం ఓ షరతు పెట్టింది. వీరు తాము ఫెయిలైన సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టులను కూడా చదవాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తున్నా స్కూళ్లలో, కాలేజీల్లో కేవలం వీరు ఫెయిలైన సబ్జెక్టులను మాత్రమే బోధించే వీలుండదు కాబట్టి ఈ నిబంధన పెట్టక తప్పలేదని తెలుస్తోంది.
మరోవైపు రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన తర్వాత సప్లిమెంటరీ పరీక్ష రాసి పాసైన వారికి ఇప్పటివరకూ కంపార్ట్ మెంటల్ గా మార్క్ షీట్స్ లో ఇస్తుండగా.. ఇలా తిరిగి క్లాసులకు వెళ్లి చదువుకుని పాసైతే మాత్రం వారికి కంపార్ట్ మెంటల్ అని కాకుండా రెగ్యులర్ గానే పరిగణించబోతున్నారు. ఇది కూడా విద్యార్ధులకు మేలు చేసే నిబంధనే. ఈ కొత్త నిబంధనల ద్వారా ఫెయిలైన విద్యార్ధులకు మరోసారి చదువుకుని పాస్ కావడమే కాకుండా అదీ రెగ్యులర్ గానే సర్టిఫికెట్లు సైతం పొందే అవకాశముంది.












Click it and Unblock the Notifications