ఈసారి అసెంబ్లీ కౌంటర్ స్పెషల్- జగన్ సర్కార్ వివరణల పర్వం-కారణాలపై సర్వత్రా చర్చ!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండోరోజులు గడిచిపోయింది. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి విపక్షాలన్నీ ఏకమై చేస్తున్న రెండు కీలక ఆరోపణలకు సంబంధించిన వివరణలు ఇచ్చుకునేందుకే ప్రాధాన్యమిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలతో మొదలుపెట్టి మంత్రులు, సీఎం జగన్ కూడా ఇదే వివరణ ఇచ్చుకున్నారు. అయితే ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై వివరణకే అసెంబ్లీ సమావేశాలు పరిమితం కాబోతున్నాయా లేక కీలకమైన బిల్లులపై చర్చ మంచిదా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ స్పెషల్
ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టడం, కీలక నిర్ణయాలుతీసుకోవడం,వాటి అమలులో మంచిచెడ్డలు చర్చించడంపై సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు మాత్రం కనిపించడం లేదు. అందుకు భిన్నంగా ప్రభుత్వం వివరణలకు పరిమితమవుతోంది. వాటిపైనా సుదీర్ఘ చర్చలు పెట్టడం ద్వారా ప్రజల్లోకి ఓ సంకేతం పంపాలనే ధోరణిలో కనిపిస్తోంది. దీంతో ఇతర అంశాలు మరుగునపడిపోతున్నాయి.

జగన్ సర్కార్ వివరణలు
ఈసారి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం,ప్రతిపక్షం కలిసి బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు అనుగుణంగానే ఐదు రోజుల సమావేశాల్లో చేపట్టాల్సిన అంశాలపై ప్రభుత్వం వివరాల్ని విడుదల చేసింది. అయితే ఇందులో కీలకమైన మూడు రాజధానుల బిల్లు గురించిన ప్రస్తావన ఉన్నట్లు లేదు.
అయితే వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ అని పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీనిపై చర్చించారు. మధ్యలో ఆందోళన చేస్తున్న విపక్ష టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసి మరీ ప్రభుత్వం వివరణ పూర్తి చేసింది. అలాగే రెండోరోజు కూడా ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై చర్చ మొదలుపెట్టారు. ఇక్కడా అదే పరిస్ధితి. మళ్లీ టీడీపీ సస్పెన్షన్. ప్రభుత్వ వివరణ పూర్తయిపోయింది. దీంతో రెండు రోజుల పాటు వివరణలే కొనసాగినట్లయింది.

కీలక బిల్లులపై చర్చేదీ?
మరోవైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదింపజేసుకోవాల్సిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సమగ్రంగా చర్చించి, అవసరమైతే వివరణ ఇచ్చి, చివరికి మెజారిటీ ఆధారంగా వాటిని ఆమోదింపచేసుకునే అవకాశం ఉండనే ఉంది. కానీ ఈ చర్చలు, వివరణల మాటున కీలక బిల్లులపై చర్చలు ముందుకు సాగడం లేదు.
దానికి బదులుగా బిల్లుల్ని ప్రభుత్వం నేరుగా స్పీకర్ సాయంతో ఆమోదింపచేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మూడు రాజధానుల బిల్లును కూడా మరోసారి ఇదే తరహాలో ఆమోదింపచేసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఇదంతా చూస్తుంటే ఇంత భారీ మెజారిటీ ఉన్న ప్రభుత్వం సైతం ప్రజాస్వామ్య బద్ధంగా చేపట్టాల్సిన ప్రక్రియకు ఎందుకు భయపడుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరణల వెనుక మతలబు ఇదేనా?
ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఇస్తున్న వరుస వివరణలు చూస్తున్న వారికి ఓ విషయం మాత్రం క్లియర్ గా అర్దమవుతోంది. అదే తమ గొంతు ప్రజల్లోకి వెళ్లడం లేదన్న ఆవేదన. ఓవైపు విపక్షాలు, మరోవైపు వారికి అనుకూలంగా జనంలోకి వార్తలు వండివారుస్తున్న ఎల్లో మీడియా మధ్య తమ గొంతు జనంలోకి చేరడం లేదు.
దాంతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిపైనా జనంలో అపోహలు పెరుగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా తమ వివరణ ఇస్తే అది జనంలోకి వెళ్తుంది, రికార్డుల్లోకి కూడా వెళ్తుందన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది. లేకపోతే మూడు రాజధానులపై కానీ, ఆర్ధిక పరిస్ధితిపై కానీ ఇంత సుదీర్ఘ చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications