Amaravati : అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. హైకోర్టుకు తెలిపిన జగన్ సర్కార్ !
అమరావతి రైతులకు జగన్ సర్కార్ ఎట్టకేలకు ఊరట కలిగించే వార్త చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చినందుకు ప్రతిగా వారికి చెల్లిస్తున్న వార్షిక కౌలు మొత్తం చెల్లింపు విషయంలో ఆలస్యం కావడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు కీలక సమాచారం ఇచ్చింది.దీంతో ఈ వివాదానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏపీలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఏటా రూ.200 కోట్ల మేర కౌలు రూపంలో చెల్లిస్తోంది. అయితే ప్రతీ ఏటా ఈ కౌలు మొత్తం విడుదల విషయంలో ఆలస్యం జరుగుతూనే ఉంది.దీనిపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ కౌలు మొత్తం బకాయిలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ ఈ ఏడాది కూడా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కౌలు బకాయిల విడుదల కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై హైకోర్టులో అమరావతి రైతుల తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. ప్రభుత్వం అమరావతి రైతులకు గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు సకాలంలో కౌలు మొత్తం విడుదల చేయకపోవడంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్ల కౌలు బకాయిల మొత్తాన్ని జమ చేశామని, త్వరలోనే ఇది రైతుల ఖాతాలకు చేరుతుందని వెల్లడించింది.
ప్రభుత్వ వాదనపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్.. ఈ కౌలు మొత్తం బకాయిలు రైతులకు అందినట్లు రాతపూర్వకంగా తమకు ఆధారాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. అయితే ప్రభుత్వం కౌలు విడుదలకు జీవో జారీ చేసిన నేపథ్యంలో త్వరలో ఈ మొత్తం రైతులకు చేరే అవకాశముంది.












Click it and Unblock the Notifications