మళ్లీ మూడు రాజధానుల బిల్లు ? ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ! బుగ్గన తాజా వ్యాఖ్యల వెనుక ?
ఏపీలో మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెనక్కి తగ్గబోమంటూ ఆర్ధికమంత్రి బుగ్గన తాజాగా వ్యాఖ్యానించారు.
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై విపక్షాల్నీ మూకుమ్మడిగా వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో మంత్రులు, నేతలు భిన్నమైన ప్రకటనలతో ఆ గందరగోళాన్ని మరింత పెంచారు. దీంతో అసలు మూడు రాజధానులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటుకునేందుకు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని వేదికగా చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పరోక్షంగా ఈ సంకేతాలు ఇచ్చారు.

మూడు రాజధానుల బిల్లు
ఏపీలో మరోసారి మూడు రాజధానుల బిల్లు తెరపైకి వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం రెండు బిల్లుల్ని తయారు చేసి వాటికి అసెంబ్లీ, మండలి, గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయినా హైకోర్టులో వ్యక్తమైన అభ్యంతరాలతో అసెంబ్లీలోనే వాటిని వెనక్కి తీసేసుకుంది. అయితే ఆ సందర్భంగా సీఎం జగన్ త్వరలోనే అందులో మార్పులు చేసి అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రకటించారు. కానీ అలా జరగలేదు. దీంతో ఇక మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం అంత సులువు కాదని అందరికీ అర్ధమైపోయింది. ఇప్పుడు మరోసారి దీన్ని ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తోంది.

మరోసారి అసెంబ్లీలో రాజధానుల బిల్లు ?
గతంలో అసెంబ్లీ ఆమోదం తీసుకున్న మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో మరోసారి వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేర్చాల్సిన అంశాలపై ప్రభుత్వ వర్గాలు న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణ నేపథ్యంలో ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో త్వరలో మరోసారి అసెంబ్లీలో రాజధానుల బిల్లు పెట్టడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

బడ్జెట్ సమావేశాల్లో పెట్టే ఛాన్స్ ?
ఈసారి అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోలా రెండు బిల్లులు పెడతారా లేక ఒకే బిల్లు పెడతారా అన్నది తేలాల్సి ఉంది. గతంలో హైకోర్టు అమరావతే రాజధాని అని, సీఆర్డీయే చట్టానికి భిన్నంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు చెల్లవని మాత్రమే చెప్పింది. దీంతో ఆ విషయం సుప్రీంకోర్టులో తేల్చుకోవచ్చని భావిస్తున్న సర్కార్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి మూడు రాజధానులు ఆమోదం పొంది రాజధాని మార్పు జరగకపోతే వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ 2025కు వాయిదా పడబోతోంది. అందుకే ప్రభుత్వం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది.

బిల్లు వెనక్కి తీసుకోబోమన్న బుగ్గన ?
అదే సమయంలో తాజాగా విశాఖ రాజధానిపై వరుసగా వ్యాఖ్యలు చేస్తున్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోబోమని మరో హింట్ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా ఇచ్చిన మూడు రాజధానుల హామీ ప్రకారం బిల్లుపై వెనక్కి తగ్గే అవకాశాల్లేవని ఆయన తాజాగా చెన్నెలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రోడ్ షోలో పేర్కొన్నారు. తద్వారా మూడు రాజధానుల బిల్లు ఎప్పుడైనా అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. అయితే సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ప్రభుత్వం అంత డేర్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న.












Click it and Unblock the Notifications