వాలంటీర్లా ? జన్మభూమి కమిటీలా ?- వచ్చేవారం గురజాల నుంచి సర్వే మొదలు!
ఏపీలో వాలంటీర్ల వ్యవస్ధపై దాదాపు నెల రోజులుగా రచ్చ కొనసాగుతోంది. విపక్ష నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం దుర్వినియోగంపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎదురుదాడి మొదలైనా, మహిళా కమిషన్ స్పందించి నోటీసులు జారీ చేసినా విమర్శల జడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల పనితీరుపై ఇప్పటికే ప్రభుత్వం నిశిత పరిశీలన చేస్తున్నా.. ఇప్పుడు వారి సచ్ఛీలతకు మరో పరీక్ష పెట్టబోతోంది.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పై వచ్చేవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారం గురజాలలో సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు. దాచేపల్లి మండలం మాదినపాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాసు మహేష్ ఈ విషయం తెలిపారు.

175 నియోజకవర్గాల లో మొట్టమొదటగా గురజాలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జన్మభూమి కమిటీలు కావాలా, జగన్ వాలంటీర్ వ్యవస్థ కావాలా అనే అంశంపై సర్వే నిర్వహిస్తామని ఎమ్మెల్యే కాసు మహేష్ తెలిపారు. సర్వేలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. వాలంటరీ, సచివాలయ వ్యవస్థను చూపించే తిరిగి ప్రజల ఓట్లు అడుగుతామన్నారు. సచివాలయంతో పాటు వాలంటీర్ల వ్యవస్థల వలన ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని కాసు ఆరోపించారు.
ఈ సర్వే తర్వాత ప్రజలే ప్రతిపక్షాల చెంప చెల్ మనిపిస్తారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు. ఈ సర్వేలో ప్రజల్ని భాగస్వాముల్ని చేసి అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్ధ విషయంలో పవన్ వ్యాఖ్యల తర్వాత మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినా పవన్ పట్టించుకోకపోవడంపై ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పవన్ వ్యాఖ్యలకు కొనసాగింపుగా చంద్రబాబు కూడా మరోసారి వాలంటీర్లపై విమర్శలు మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు సర్వే చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications