పోటీపై మారిన మాజీ జేడీ నిర్ణయం - బీజేపీకి షాక్..!!
ఏపీలో ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2014 పొత్తులు రిపీట్ అవ్వటంతో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సీట్ల ఖరారు ప్రక్రియ దాదాపు అన్ని ప్రధాన పార్టీల్లోనూ చివరి దశకు చేరింది. సీఎం జగన్ ఈ నెల 16న అధికారికంగా తమ అభ్యర్దులను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో గోదావరి, విశాఖ కీలకంగా మారుతున్నాయి. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ కేంద్రంగా పోటీ పైన కీలక నిర్ణయం ప్రకటించారు.
సీబీఐ మాజీ జేడీ, భారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీపై మనసు మార్చుకున్నారు. 2019 ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలానికే జనసేన వీడారు. స్వచ్చంద సంస్థ నిర్వహిస్తూ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కోర్టులోనూ న్యాయ పోాటం కొనసాగిస్తున్నారు. తాజాగా భారత్ పార్టీ అని సొంత పార్టీని ప్రకటించారు. తాను విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానంటూ లక్ష్మీనారాయణ చెబుతూ వచ్చారు. ఇప్పుడు తన పార్టీ ఉత్తరాంద్ర కార్యాలయాన్ని విశాఖలో ప్రారంభించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. విశాఖ ఉత్తరం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా విజయం సాధించారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఈ సీటును బీజేపీ కి కేటాయించారు. ఇక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు తిరిగి పోటీ చేయనున్నారు. అయితే, వైసీపీ వర్సస్ కూటమిగా పోటీ మారుతున్న వేళ..విశాఖ నగరంలో లక్ష్మీనారాయణ పోటీ చేయటం ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, లక్ష్మీనారాయణ కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారా..ఎంపీగానూ బరిలో నిలుస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఈసీ కేటాయించింది.












Click it and Unblock the Notifications