సీమాంధ్ర పెత్తనానికి పరాకాష్ఠ, కౌంటరిస్తాం: కిరణ్‌పై జానా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు సీమాంధ్ర పెత్తనానికి నిదర్శనమని, లక్ష్యం పూర్తయ్యాక తగిన రీతిలో తాము సమాధానం చెబుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి బుధవారం అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు అంశం రాజకీయంగా వేడి రాజేసిన విషయం తెలిసిందే.
దీనిపై జానా నేతృత్వంలో పలువురు మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జానా విలేకరులతో మాట్లాడారు. కిరణ్ తీరును తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు, అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ అంశం, ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తాము గవర్నర్‌కు వివరించామన్నారు.

రెండు మూడు రోజుల్లో తాము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కిరణ్ ఇలాంటి చర్యలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరిగేందుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని కోరారు. చర్చ జరగకుండా అడ్డుకోవాలని ఎవరు చూస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కిరణ్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తామన్నారు. కిరణ్ వ్యవహార శైలిని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. శ్రీధర్ బాబు శాఖను కిరణ్ మార్చడం సీమాంధ్ర పెత్తనానికి నిదర్శనం, పరాకాష్ఠ అన్నారు.శాఖను మార్చి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. సభలో చర్చ దృష్ట్యా ప్రజలు సంయమనం పాటించాలన్నారు.
వినాశకాలే విపరీత బుద్ధి అనే దానికి కిరణ్ తీరు నిదర్శనమన్నారు. ప్రజలలో ఆందోళన ఉందని, తాము అంతకంటే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నామన్నారు. 15 రోజులు అందరూ సంయమనం పాటించాలని కోరారు. తీర్మానం గురించి అర్థం పర్థం లేని ప్రచారం జరుగుతోందన్నారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు అప్రజాస్వామికమన్నారు.












Click it and Unblock the Notifications