జనసేనలో ముందస్తు మూడ్- వారాహి యాత్ర కోఆర్డినేటర్లు వీరే
అమరావతి: రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేయాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారంటూ వార్తలు వెల్లువెత్తుతోన్నాయి.
నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు. ఆరు నెలలుగా ముందుగానే వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఇవే సంకేతాలను పార్టీ క్యాడర్‌కు పంపించారు.

ఈ పరిణామాల మధ్య జనసేనలో కూడా ముందస్తు మూడ్ కనిపిస్తోంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన వారాహి యాత్రతో తన బలాన్ని చాటుకోవాలని భావిస్తోంది. ఈ యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ అగ్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్ర సాగేలా నియోజకవర్గ స్థాయిలో ముందు జాగ్రత్తలను తీసుకుంటోంది. పార్టీ సీనియర్ నాయకులు బాధ్యతలను అప్పగించింది.
వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది జనసేన పార్టీ. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున సీనియర్ నాయకులకు కోఆర్డినేటర్లుగా అపాయింట్ చేసింది. ముందుగానే రూపొందించుకున్న రూట్ మ్యాప్‌కు అనుగుణంగా నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభలను నిర్వహించడం, వారాహి యాత్రకు భారీగా జనాన్ని సమీకరించడం, పవన్ కల్యాణ్ ఛరిష్మాను గ్రామస్థాయికి తీసుకెళ్లడం.. వంటి బాధ్యతలను కోఆర్డినేటర్లు చూసుకోవాల్సి ఉంటుంది.
నర్సీపట్నం- బొలిశెట్టి సత్యనారాయణ, వంపూరు గంగులయ్య, పాయకరావుపేట- గడసాల అప్పారావు, మూగి శ్రీనివాస్, యలమంచిలి- బండ్రెడ్డి రామకృష్ణ, బేతపూడి విజయశేఖర్, తుని- బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర, ప్రత్తిపాడు- చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కల గాంధీ, పిఠాపురం- బొమ్మిడి నాయకర్, చిల్లపల్లి శ్రీనివాస్.. సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.

కాకినాడ రూరల్- నయూబ్ కమల్, కాకినాడ అర్బన్- గాదె వెంకటేశ్వర రావు, ముమ్మడివరం- బొలిశెట్టి సత్యనారాయణ, అమలాపురం- బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, పీ గన్నవరం- గడసాల అప్పారావు, రాజోలు- చిలకం మధుసూదన్ రెడ్డి అపాయింట్ అయ్యారు. జనవాణి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యతను డీ వరప్రసాద్‌కు అప్పగించింది పార్టీ.












Click it and Unblock the Notifications