టీడీపీ పై బీజేపీ పవన్ అస్త్రం - కొత్త వ్యూహం, ఏం జరుగుతోంది..!!
ఏపీలో రాజకీయ ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్డీఏ సమావేశానికి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం అందింది. పాత, కొత్త మిత్రులను పిలుపుస్తున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని మాత్రం ఇప్పటి వరకు ఆహ్వానించలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ , జనసేన కలిసి కట్టుగా పోటీ చేసి వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు..పవన్ వ్యూహం. ఇప్పుడు టీడీపీకి బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఈ సమయంలో పవన్ పాత్ర కీలకంగా మారనుంది.
మారుతున్న సమీకరణాలు
జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఎన్డీఏ పాత, కొత్త మిత్రులతో కూటమి బలోపేతం చేసుకొనే దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పలు పార్టీలను ఈ నెల 18న ఢిల్లీలో జరిగే సమావేశానికి ఆహ్వానించారు. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం అందింది.

టీడీపీని ఆహ్వానించినట్లు సమాచారం లేదు. బీజేపీ నేతలు టీడీపీకి ఆహ్వానం పంపలేదని చెబుతున్నారు. ఈ సమావేశానికి పవన్ హాజరవుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం ప్రధాన అజెండాగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జనసేన మాత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ప్రస్తుతానికి కనిపిస్తోంది.
ఎన్డీఏ భేటీకి జనసేన
టీడీపీ 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో ప్రధాని మోదీ పైన టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు..ఆ తరువాత రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ తో పొత్తుతో మోదీకి వ్యతిరేకంగా చేసిన రాజకీయం ఇప్పుడు అడ్డు వస్తున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా..ఎలక్షన్ మేనేజమ్మెంట్ లో భాగంగా బీజేపీతో పొత్తు అవసరమని టీడీపీ భావిస్తోంది.
ఇప్పటి వరకు బీజేపీ తో పవన్ కొనసాగుతారా లేదా అనే సందేహాల నడుమ పవన ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నారు. దీని ద్వారా ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసేందుకు పవన్ సిద్దంగా ఉన్నారనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని బీజేపీ పదే పదే చెబుతోంది. దీని ద్వారా టీడీపీతో కలిసేందుకు సిద్దంగా లేరని స్పష్టం అవుతోంది.
పవన్ కేంద్రంగా కొత్త రాజకీయం
ఈ సమయంలో టీడీపీ - జనసేన బంధం పైన పలు సందేహాలు మొదలయ్యాయి. తమతో ఉన్న పవన్ ను టీడీపీతో వెళ్లకుండా బీజేపీ నియంత్రించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకు పవన్ సిద్దమేనా కాదా అనేది తేలాల్సి ఉంది. పవన్ వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్నారు.
ఇందు కోసం బీజేపీ, టీడీపీని కలిపే ప్రయత్నాలు కొనసాగిస్తారని జనసేన ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ చివరి వరకు టీడీపీతో కలిసేందుకు ముందుకు రాకపోతే పవన్ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో, బీజేపీ తమతో కలిసి రాకపోయినా టీడీపీకి పెద్దగా నష్టం లేదు. అదే పవన్ ను తమతో కలవకుండా చేస్తే టీడీపీకి నష్టం తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో, ఇప్పుడు పవన్ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications