జగనన్న వస్తున్నాడు..కార్లు జాగ్రత్త : సీఎం తిరుపతి పర్యటన వేళ - దండోరా వేస్తూ...!!
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 5వ తేదీన తిరుపతి పర్యటనకు రానున్నారు. ఇదే సమయంలో జనసేన తిరుపతిలో కొత్త తరహా ప్రచారం ప్రారంభించింది. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ పార్క్ వద్ద 'జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త' అంటూ ప్రచారం చేసారు. వారం క్రితం సీఎం జగన్ ఒంగోలు పర్యటన సమయంలో ఓ కుటుంబం తిరుపతి వెళ్తుండగా..రవాణా శాఖ అధికారులు బలవంతగా ఆ కుటుంబం తిరుపతికి మాట్లాడుతున్న వాహనాన్ని బలవంతంగా తీసుకున్నారు. దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీని పైన స్వయంగా సీఎంఓ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కారకులైన సహాయ వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటుగా హోం గార్డును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక, ఇప్పుడు తిరుపతిలో ఈ నెల 5వ తేదీన పర్యటనలో భాగంగా..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలిపిరిలో చిల్డ్రన్స్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. విద్యా కానుక బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. అయితే, తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జి కిరణ్ రాయల్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

సీఎం జగన్ తిరుపతికి వస్తున్నారని.. అయితే సీఎం కాన్వాయ్‌కు సంబంధించి ఏ ఒక్క ట్రాన్స్‌పోర్టు అధికారి కూడా అందుబాటులో లేరని ఆరోపించారు. ఇప్పటికే ట్రావెల్స్ వారికి సంబంధించి రూ.2 కోట్ల బకాయిలు ఉన్నాయని.. దీంతో ఎవ్వరూ సీఎం కాన్వాయ్‌కు కార్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరని ఎద్దేవా చేశారు. దీంతో తిరుపతి స్థానిక ప్రజలు, తిరుమలకు వస్తున్నభక్తులు కూడా కార్లలో రావద్దని జనసేన నేతలు సూచించారు. జనసేన నేతల ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు దీనికి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. సీఎం జగన్ ప్రతీ బహిరంగ సభలో చంద్రబాబుతో పాటుగా జనసేన అధినేత పవన్ ను సైతం దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారు. తనను దత్తపుత్రుడు అంటే తాను సీఎం జగన్ ను సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక, ఇప్పుడు జనసేన చేస్తున్న తాజా ప్రచారంతో ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.