యుద్ధం అన్నింటికీ పరిష్కారం కాదు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వేలో పర్యటిస్తున్నారు. అయితే నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ తో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు నార్వే అండగా నిలిచిందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రపంచ ఉగ్రవాదానికి ముగింపు పలకాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరులో అండగా నిలిచినందుకు నార్వేకు కృతజ్ఞతలు తెలిపారు.
సైనిక ఘర్షణలు శాంతియుత వాతావరణానికి సహాయపడవని, పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా యుద్ధం, ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇటీవల భారత్ - ఈయూ మధ్య ఒప్పందం కుదిరిందని దీనివల్ల భారత్, నార్వేలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. నార్వే నుంచి భారత్ కు సాంకేతికత, పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఇంజినీరింగ్, పరిశోధన విభాగాల్లో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. భారత్- నార్వే మధ్య గ్రీన్ స్ట్రేటజీ కారణంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అలాగే మేరిటైమ్ భద్రతలోనూ నార్వేతో కలిసి భారత్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మే 19-20 మధ్య ఇటలీ వెళ్లనున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియా మట్టరెల్లాలతో సమావేశం జరిపి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను సమీక్షించనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ స్వీడన్ లో పర్యటించిన విషయం తెలిసిందే. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో గోథెన్ బర్గ్ నగరంలో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, రక్షణ తదితర రంగాలపై చర్చించారు. అంతకుముందు నెదర్లాండ్స్, యూఏఈలోనూ ప్రధాని మోదీ పర్యటించారు.












Click it and Unblock the Notifications