భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సేవలకు ముహూర్తం ఫిక్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ విమానాశ్రయం కార్యాకలాపాలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో విశాఖపట్నం నుండి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలనుకునే వారికి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
భోగాపురం ఎయిర్ పోర్ట్ కి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
విశాఖ నుండి భోగాపురం ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఏరో ఎక్స్ ప్రెస్ పేరుతో 20 ఆధునిక ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అందుబాటులోకి తెచ్చేందుకు రవాణా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ బస్సులు ఎయిర్పోర్ట్ కోసమే రూపొందించబడ్డాయి. ఈ బస్సులు 12 మీటర్ల పొడవు, 40 సీట్ల సామర్థ్యంతో రూపొందించబడ్డాయి.

పర్యావరణ హిత బస్సులు.. సౌకర్యాలు ఇలా
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ఈ పర్యావరణ హిత బస్సుల్లో సిసిటీవీ కెమెరాలు, డిజిటల్ డిస్‌ప్లేలు, లగేజీ కోసం ప్రత్యేక స్థలం ఉన్నాయి. ఇప్పటికే 16 బస్సుల ట్రయల్ రన్‌లు విజయవంతంగా పూర్తి కాగా, మిగిలినవి తుది దశలో ఉన్నాయి. విశాఖ నుంచి రెండు ప్రధాన మార్గాల్లో ఈ సర్వీసులు నడుస్తాయి.
రెండు రూట్ లలో 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
మొదటి రూట్ లో దాదాపు 70కి.మీ గాజువాక నుంచి బయలుదేరి ఎన్‌ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, మధురవాడ మీదుగా భోగాపురం చేరుకుంటుంది . రెండవ రూట్ దాదాపు 85 కి.మీ సింధియా, విశాఖ రైల్వే స్టేషన్, బీచ్ రోడ్, ఐటీ హిల్స్, మారికవలస మీదుగా సాగుతుంది . ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా షెడ్యూల్ ఏర్పాటు చేశారు.
టికెట్ చార్జీలు చాలా తక్కువ
ప్రైవేట్ టాక్సీల్లో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు రూ.800 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. కానీ ఏరో ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణించే వారికి గణనీయంగా తక్కువ ధరలలో సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుంది. నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి గరిష్టంగా రూ.300 నుంచి రూ.400 వరకు ఛార్జీ ఉండగా, మధురవాడ పరిసరాల నుంచి ప్రయాణించేవారికి కేవలం రూ.100కే టికెట్ అందుబాటులోకి రానుంది.
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. ఆగస్టు 17 నుంచి భోగాపురం నుంచి వాణిజ్య విమానాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.



Click it and Unblock the Notifications