కేంద్రం అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం విజయ్- నీట్ పై అసెంబ్లీలో తీర్మానం
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కోరింది. అధికార కూటమితో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ తీర్మానానికి పూర్తి మద్దతును తెలియజేశాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, వామపక్షాలు, పీఎంకే సభ్యులు ఈ తీర్మానానికి సానుకూలంగా ఓటు వేశారు. బీజేపీ ఎమ్మెల్యే మాత్రం వాకౌట్ చేశారు.
ఈ తీర్మానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌రాజ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు అభ్యంతరాలను లేవనెత్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న నీట్ పరీక్ష విధానం సామాజిక న్యాయానికి, సమానత్వానికి భంగం కలిగించేదిగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల విద్యా హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, సామాజికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే సువర్ణ అవకాశాలను నీట్.. పూర్తిగా దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య విద్య ప్రవేశాల కోసం ఒక్క రోజులో రాసే పరీక్ష ఆధారంగా విద్యార్థుల భవిష్యత్, వారి అర్హతలను నిర్ణయించడం ఎంత మాత్రమూ సరైన పద్ధతి కాదని మంత్రి అరుణ్ రాజ్ స్పష్టం చేశారు. 12 సంవత్సరాల పాటు పాఠశాలల్లో విద్యార్థులు పడ్డ కష్టాన్ని ఈ విధానం పూర్తిగా తుడిచిపెట్టేస్తోందని అన్నారు. నీట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు ఇవ్వడం వల్ల విద్యార్థులు పాఠశాల చదువులపై శ్రద్ధ తగ్గించి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ పరీక్ష ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయని, అవి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయని అరుణ్ రాజ్ ఈ తీర్మానంలో ఆరోపించారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఖర్చులు భారం కావడంతో ప్రతిభ ఉన్నా పేద విద్యార్థులు డాక్టర్ చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. ఈ పరీక్ష విధానం ఆర్థికంగా బలంగా ఉన్న వర్గాలకే మేలు చేస్తోందని తేల్చి చెప్పారు.
ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు విద్యార్థులలో తీవ్ర అపనమ్మకాన్ని కలిగించాయని, ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం అత్యంత బాధాకరమని అరుణ్ రాజ్ చెప్పారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల వైద్య విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఈ విధానానికి శాశ్వతంగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని, రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కోరుతోంది. వైద్య విద్యలో పారదర్శకతను కాపాడుతూనే, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు పాఠశాల విద్యా ప్రమాణాల ప్రాతిపదికన 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా విజయ్ ప్రభుత్వం చేసిన ఈ తాజా తీర్మానం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది.




Click it and Unblock the Notifications