జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్దం - ఎవరెక్కడ, లిస్టులో..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీలో సీఎం జగన్ సామాజిక లెక్కలతో అభ్యర్దులను మారుస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఎలాగైనా జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అటు వైసీపీ ఇంఛార్జ్ లను మారుస్తున్న వేళ..ఇటు టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు వేగవంతం చేసాయి. జనసేన నుంచి పోటీ చేసే స్థానాలు..అభ్యర్దులను పవన్ కల్యాణ్ దాదాపు డిసైడ్ చేసారు. జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అభ్యర్దుల ఎంపిక: ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. అభ్యర్దుల ఖరారు పైన తుది కసరత్తు చేస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ రోజు జరిగే యువగళం ముగింపు సభలో కీలక ప్రకటనకు రెండు పార్టీల అధినేతలు సిద్దమయ్యారు. 2014 తరువాత చంద్రబాబు, పవన్ ఒకే వేదిక మీదకు వస్తున్నారు.

జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి 27 అసెంబ్లీ ...2 లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. దీనిని అధికారంకంగా వెల్లడించాల్సి ఉంది. అనకాపల్లి, మచిలీపట్నం లోక్ సభ స్థానాలు జనసేనకు కేటాయించటం దాదాపు ఖాయమైంది. రాజంపేట సీటు పైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాల పై మాత్రం ఒక అంగీకారానికి వచ్చారు.
తుది కసరత్తు: జనసేనకు కేటాయించే స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ అభ్యర్దులను ఖరారు చేసారు. వైసీపీ చేస్తున్న మార్పులు - చేర్పుల తరువాత అవసరమైతే మార్పులు చేసే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. భీమవరంతో పాటుగా తిరుపతిలోనూ పవన్ చేస్తారని తెలుస్తోంది. కానీ, ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఖరారు చేసిన జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. నెల్లిమర్ల- లోకం నాగ మాధవి, గజపతిపురం - పడాల అరుణ , గాజువాక -సుందరపు సతీష్, భీమిలి - పంచకర్ల సందీప్ లేదా పెందుర్తి -పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి -సుందరపు విజయ్ కుమార్, ముమ్మిడివరం -పీతాని బాలకృష్ణ పేర్లు ఖరారయినట్లు విశ్వసనీయ సమాచారం.
జాబితా సిద్దం: అదే విధంగా రాజానగరం -బత్తుల బలరామకృష్ణ , రాజమండ్రి రూరల్ -కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ - పంతం నానాజీ , పిఠాపురం - ఉదయ శ్రీనివాస్. రామచంద్రాపురం -చిక్కం దొరబాబు, జగ్గంపేట -పాలెం శెట్టి సూర్యచంద్రరావు , రాజోలు- డిఎంఆర్ శేఖర్ , భీమవరం -పవన్ కళ్యాణ్, తణుకు -విడవడ రామచంద్రరావు, తాడేపల్లిగూడెం -బొల్లి శెట్టి శ్రీనివాస్ , నరసాపురం - బొమ్మిడి నాయకర్, విజయవాడ వెస్ట్ - పోతిన మహేష్, తెనాలి - నాదెండ్ల మనోహర్, గిద్దలూరు - ఆమంచి శ్రీనివాసరావు పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నియోజవర్గాలలో టీడీపీ ఇంఛార్జ్ లతో చంద్రబాబు మాట్లాడనున్నారు. జనసేనకు సీట్లు ఇస్తుండటంతో వారికి భవిష్యత్ పైన హామీ ఇవ్వనున్నారు. ఆ తరువాత తమ అభ్యర్దుల పేర్లను జనసేనాని అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications