వైఎస్ జగన్ పై పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్
రాష్ట్ర రాజకీయం మొత్తం పిఠాపురంలో మొహరించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేయనుండటమే దీనికి కారణం. జనసేనానిని ఓడించేందుకు వైసీపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఎక్కడినుంచి పోటీచేసినా పవన్ ను ఓడించడమే ధ్యేయంగా వైసీపీ వ్యూహాలు రచించుకుంటూ వచ్చింది. పిఠాపురం ప్రకటన రావడమే తరువాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయం ప్రారంభమైంది. వివిధ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను వైసీపీలోకి ఆహ్వానించారు. వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థి వంగీ గీతను నిలిపిన సంగతి తెలిసిందే.
వైసీపీ వ్యూహాలకు పవన్ కల్యాణ్ ప్రతి వ్యూహాలు అమలు చేస్తూ ఆ పార్టీని అయోమయానికి గురిచేస్తున్నారు. పిఠాపురం ప్రకటనకు ముందు కాకినాడ ఎంపీ అంటూ ప్రచారం చేయించారు. అప్పటికే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడలో సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ కూడా పూర్తిచేసుకున్నారు. గాజువాక, భీమవరం లాంటి నియోజకవర్గాల పేర్లు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ బీజేపీ అధిష్టానం కోరిక మేరకు కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేయమన్నారనే ప్రచారాన్ని జనసేన శ్రేణులు ప్రారంభించాయి. దీంతో పవన్ ఎంపీగా పోటీచేస్తారా? లేదంటే ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? అనే సందిగ్ధంలో వైసీపీ ఉండిపోయింది.

అకస్మాత్తుగా పిఠాపురం పేరును పవన్ ప్రకటించారు. ఆ పేరు ప్రకటించే సమయానికి సర్వేలు పూర్తవడంతోపాటు పార్టీలో ముఖ్యమైన నాయకులు, సామాజికవర్గాలవారీగా పట్టున్న నేతలతో జనసేన సంప్రదించింది. అందరినుంచి మద్దతు కూడగట్టుకున్న తర్వాతే పిఠాపురం పేరును ప్రకటించారు. వంగా గీతపై ప్రశంసలు కురిపించడం కూడా పవన్ వ్యూహంలో భాగమే. కాకినాడ ఎంపీ టికెట్ ను ఉదయ్ కు ప్రకటించిన తర్వాత పవన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగైనా వైసీపీ గెలవాలనే పట్టుదలతో ఉన్న అధిష్టానం అక్కడ కోట్ల రూపాయలను గుమ్మరించడానికి కూడా సిద్ధమైందంటూ టీడీపీ, జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ మరోసారి పవన్ హఠాత్తుగా బీజేపీ అధిష్టానం పోటీచేయమంటోందంటూ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ అంటే పిఠాపురంలో ఇప్పటివరకు వైసీపీ చేసిందంతా వృథా ప్రయాసే అవుతుంది. గతంలో ఆ పార్టీతో ఉన్న అనుభవాల దృష్ట్యా పవన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.












Click it and Unblock the Notifications