APలో నరేంద్రమోడీ-అమిత్ షా సర్దుకున్నట్లేనా?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ తో 30 నిముషాలు చర్చించారు. పార్టీ వర్గాలన్నీ పవన్ కు బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చిందని చెప్పాయి. జనసేనాని కూడా ఎప్పటినుంచో తాను రోడ్ మ్యాప్ అడిగానని, అది రాగానే వైసీపీని ఓడిస్తానని గంభీరంగా చెబుతుండేవారు. అయితే మోడీ ఇచ్చిన రూట్ మ్యాప్ పవన్ కల్యాణ్ కు నచ్చలేదని భేటీ తర్వాత పవన్ ముఖకవళికలను బట్టి అందరూ అర్థం చేసుకున్నారు.

వైసీపీని ఓడించాలంటే బీజేపీ సహకారం అవసరం
వైసీపీని ఓడించడానికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన. జగన్ ను ఎదుర్కోవాలంటే మోడీ-షా లాంటివారి సహకారం అవసరమని గట్టి నమ్ముతున్నారు. అందుకే ఓర్పుగా రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నారు. మోడీతో భేటీ తర్వాత జరిగిన సభల్లో, సమావేశాల్లో పవన్ కల్యాణ్ స్వరం మారింది. తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ అడుగుతూ వస్తున్నారు. దీంతో టీడీపీ లేకుండా బీజేపీ-జనసేన పొత్తుగా వెళ్లబోతున్నాయని, నరేంద్రమోడీ-అమిత్ షా చంద్రబాబును దూరం పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి.

పవన్ కల్యాణ్ స్వరంలో మార్పు?
అకస్మాత్తుగా మళ్లీ పవన్ కల్యాణ్ స్వరంలో మార్పు వచ్చింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని, కచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి తీరుతామని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో మరోసారి తెలుగుదేశం-జనసేన పొత్తుపై వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, అందుకు అదరినీ కలుపుకొని వెళతానని వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాలకు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టత వస్తోంది.

గాడిదలు ఏం కూసినా అధికారంలోకి రాలేరు
వైసీపీ గాడిదలు ఏం కూసినా మళ్లీ అధికారంలోకి రాలేరని, గత ఎన్నికల్లో తాను విడిగా పోటీచేయడంవల్లే ఓట్లు చీలిపోయాయని, ఈసారి అటువంటి పరిస్థితి రానివ్వనని జనసేనాని మరోసారి ప్రకటించారు. దీంతోపాటు ఓటు చీలకుండా ఎలా వ్యవహరించాలి? ప్రతిపక్షాలన్నింటినీ ఎలా కలుపుకువెళ్లాలి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను ఒకే వేదికపైకి ఎలా తీసుకురావాలి? తదితర అంశాలపై పార్టీలో మేథోమధనం జరుగుతోంది. తెలుగుదేశం-జనసేన కలిసి పోటీచేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని, కాబట్టి ఆ దారిలో పయనించడానికే జనసేనాని సిద్ధపడ్డాడని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దాదాపుగా సర్దుకున్నట్లేనా? లేదంటే కలుస్తారా?
తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళితేనే వైసీపీ ఓడించగమనే భావనలో పవన్ ఉన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఆలోచనా సరళి కూడా అలాగే ఉంది. దీంతో ఒకవేళ బీజేపీ కలిసి వచ్చినా, రాకపోయినా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లడానికే సిద్ధమైనట్లుగా భావించవచ్చంటున్నారు. బీజేపీ.. టీడీపీకి దూరంగా ఉండాలనుకుంటే నరేంద్రమోడీ-అమిత్ షా సర్దుకున్నట్లేనని చెబుతున్నారు. బీజేపీని ఒప్పించి తమతో కలుపుకు వెళతారా? లేదంటే ఆ పార్టీని పక్కకు నెట్టి టీడీపీతో కలిసి వెళతారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎన్నికలు దగ్గరపడే సమయం వస్తేనే వీటిపై ఒక స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications