పొత్తులో జనసేన స్థానాల్లో మార్పులు - తాజా జాబితాలో..!!
ఏపీలో ఎన్నిక సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య ప్రధాన పోరు సాగుతోంది. షెడ్యూల్ విడుదల కావటంతో కోడ్ అమల్లోకి వచ్చింది. కూటమి తొలి ఎన్నికల సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇప్పటికే మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పైన అంగీకారానికి వచ్చారు. మధ్యవర్తిత్వం వహించినందుకు సీట్లు నష్టపోవాల్సి వచ్చిందని తాజాగా పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు, జనసేనకు ఇచ్చే సీట్ల పైన స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
సీట్ల ఖరారు
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. పవన్ తన తొలి జాబితాలో అయిదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించారు. తొలుత మూడు ఎంపీ స్థానాలు కేటాయించినా..బీజేపీతో సీట్ల చర్చల్లో భాగంగా ఒకటి తగ్గింది. కాకినాడ, మచిలీపట్నం జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఇక..జనసేన ఇప్పటికే నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, తెనాలి లో తమ అభ్యర్దులను ప్రకటించింది. నిడుదవోలు సీటును కందుల దుర్గేష్ కు ఖరారు చేసారు. మిగిలిన స్థానాల్లో ఉంగుటూరు, నర్సాపురం, తాడేపల్లి గూడెం స్థానాల్లోనూ జనసేన పోటీ చేయటం ఖాయమైంది. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

గోదావరిలో కేటాయింపు
ఇదే సమయంలో మరో 5 స్థానాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. తాజాగా జనసేనకు కేటాయించే సీట్లలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ సీటును జనసేనకి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం సీటు జనసేన కోరింది. అక్కడ టీడీపీ బలంగా ఉండటం, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పి.గన్నవరం సీటు ఆ పార్టీకి ఇవ్వనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నర్సాపురం, ఉంగుటూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం స్థానాలు జనసేనకు కేటాయించారు. అదనంగా పోలవరం కూడా ఆ పార్టీ ఖాతాలోకి రానుంది.
కొనసాగుతున్న కసరత్తు
ఇక కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ జనసేన ఖాతాలోకి వస్తాయని భావించారు. అయితే పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమను బీజేపీకి కేటాయించడంతో జనసేన అవనిగడ్డకు పరిమితమైంది. రాయలసీమలో జనసేన పార్టీకి తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయించారు. రైల్వేకోడూరు నుంచి కూడా ఆ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. కాగా, తిరుపతి అసెంబ్లీ సీటుకు ఆరణి శ్రీనివాసులును అభ్యర్థిగా ప్రకటించడంపై జనసేన, టీడీపీ స్థానిక నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అసమ్మతి నేతలతో చర్చించేందకు పార్టీ నాయకత్వం తమ ప్రతినిధులను పంపుతోంది. ఒకటి , రెండు రోజుల్లోనే జనసేన స్థానాలు, అభ్యర్దులపైన అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications