జనసేనలోకి వైసీపీ కీలక నేతల చేరికకు ముహుర్తం ఫిక్స్-బాలినేనికి తొలి ఝలక్..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి ఆ పార్టీలో నలిగిపోతున్న కీలక నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. వీరంతా జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు వీరంతా జనసేనలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. వీరందరినీ ఒకే రోజు పార్టీలో చేర్చుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.
జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి వెంకట రోశయ్యతో పాటు పలువురు నేతలు, కార్పొరేటర్లు వారి అనుచరులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే వీరు ముగ్గురూ వేర్వేరుగా పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక, ఆ తర్వాత ఇచ్చే గౌరవంపై చర్చించారు. పదవులపై పక్కాగా హామీ లభించాకే వీరు జనసేనలో చేరికకు సిద్ధమవుతున్నవారు. సెప్టెంబర్ 26న వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, డా.అవనపు భావన కూడా జనసేనలో చేరతారని పార్టీ ప్రకటించింది. అలాగే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి కూడా చేరనున్నారు.
విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పోరేషన్ల నుంచి పలువురు కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరబోతున్నారు.మరోవైపు ఒంగోలులో పవన్ సమక్షంలో చేరతానని ప్రకటించిన మాజీ మంత్రి బాలినేనికి ఝలక్ ఇచ్చారు. ఆయన కూడా మిగతా నేతలతో పాటు సెప్టెంబర్ 26నే మంగళగిరి కార్యాలయంలో పార్టీలో చేరతారు.












Click it and Unblock the Notifications