వైసీపీలోకి కోనసీమ జనసేన సీనియర్ నేత..!!
ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి అధికారం దక్కాలన్నా కీలకంగా మారుతున్న గోదావరి జిల్లాల్లో రాజకీయం హోరా హోరీగా మారుతోది. కూటమిలో మూడు పార్టీ సీట్ల సర్దుబాటులో కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి. జనసేనలో కీలకంగా పని చేసి సీట్లు రాని నేతలు పార్టీ వీడుతున్నారు. తాజాగా కోనసీమలో మరో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేసారు. వైసీపీలో చేరేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.
మారుతున్న లెక్కలు
జనసేనకు పట్టున్న ప్రాంతంలో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీ కోసం పని చేసిన పలువురు సీనియర్లకు సీట్లు దక్కలేదు. దీంతో, వారు పార్టీ వీడుతున్నారు. పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పితాని బాలకృష్ణ రాజీనామా చేయగా.. నేడు కోనసీమలో కీలకమైన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా సమయం లో పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. అమలాపురం అంటే జనసేన కంచుకోట అని.. అలాంటి కీలకమైన నియోజక వర్గాన్ని టీడీపీకి పొత్తుపేరుతో ధారాదత్తం చేశారని ఆరోపించారు.

జనసేనకు రాజీనామా
జనసేన జెండానే ఊపిరిగా.. పార్టీయే ప్రాణంగా బతికిన జనసైనికులకు అన్యాయం చేసారని మండిపడ్డారు. అమలాపురం నియోజకవర్గంతో మెగా కుటుంబానికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేసారు. జనసేన బలోపేతం కోసం తాము కష్టపడ్డామని వివరించారు. అలాంటి నియోజకవర్గంతో పవన్ కల్యాణ్ జనసేన జెండా పీకేసారని వ్యాఖ్యానించారు. అమలాపురం అంటే జనసేనకు గుండెకాయ అని చెప్పిన పవన్ ఇప్పుడు ఆ సీటును టీడీపీకి ఎలా ఇస్తారని నిలదీసారు. టీడీపీ ఒత్తిడి కారణంగానే ఈ మార్పు జరిగిందని రాజబాబు వివరించారు.
వైసీపీలో చేరుతారా
పి గన్నవరం, రాజోలు అభ్యర్దుల పైనా రాజబాబు విమర్శలు చేసారు. టికెట్ల ఖరారు విషయంలో డబ్బులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పవన్ పైన విమర్శలు గుప్పించారు. రాజబాబు త్వరలోనే వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత పైన హామీ దక్కినట్లు సమాచారం. గోదావరిలో మరి కొన్ని ముఖ్య చేరికలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో, కోనసీమ ప్రాంతంలో మారుతున్న సమీకరణాలు ఎన్నికల పైన ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications