విశాఖ రాజధాని ఎవరూ కోరుకోవట్లేదు-అదే అజెండాతో ఎన్నికలకు రెడీనా ? నాదెండ్ల మనోహర్ సవాల్
ఏపీలో విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవడం లేదని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజధానిపై ఉత్తరాంధ్రులకే నమ్మకం లేదన్నారు.
తెనాలి: విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవరూ కోరుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే రాజధాని అంశం మీద ఎన్నికలకు వెళ్దాం రమ్మని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖలో రాజధాని పెట్టి కార్యాలయాలు ఏర్పాటు చేస్తే తమ జీవితాలు మారిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించడం లేదన్నారు. రాజధాని అంశంలో మంత్రుల్లోనే సఖ్యత లేదని తెలిపారు.
రోడ్డు కూడా వేయలేని సీఎం రాజధానుల గురించి మాట్లాడుతున్నారని, ఉన్న రాజధానిని ఉద్దరించలేకపోయారని నాదెండ్ల వ్యాఖ్యానించారు. రైతుల త్యాగాలను పక్కనపెట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా చేశారన్నారు. ఒక తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదన్నారు. ఉత్తరాంధ్ర వాసులు కూడా విశాఖ రాజధాని కావాలని కోరుకోవడం లేదన్నారు. పెట్టుబడులు తీసుకువచ్చి నిజాయితీగా ఉపాధి అవకాశాలు కల్పించాలిగాని రోజుకో ప్రకటన చేస్తే పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారన్నారు.

మీ మంత్రులే రోజుకో మాట మాట్లాడుతారు, ఒకరు విశాఖ ఎగ్జికూటివ్ క్యాపిటల్ అంటారు. ఇంకొకరు అదే అసలు రాజధాని అంటారు. ముఖ్యమంత్రి నేను కూడా విశాఖ వెళ్లిపోతున్నానని చెబుతారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఏకంగా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరతారు. రాష్ట్రాన్ని ఇంకెన్ని సార్లు విభజిస్తారని, ఎన్నిసార్లు అవమానిస్తారని నాదెండ్ల ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మీ రాజకీయ లబ్ధి కోసం పదే పదే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ది లేదని, మీలో నిజాయతీ ఉంటే అమరావతితో పాటు విశాఖ, కర్నూలులను ఒకే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. చేతకాని దద్దమ్మలు, ప్రభుత్వం నడపలేని వ్యక్తులు అంటూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయ్యిందని, ఇప్పటి వరకు ఏం సాధించగలిగామని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం పబ్బం గడుపుకుంటున్నారని, జనసేన పార్టీ అప్పడు, ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తోంది. అది అమరావతే రాష్ట్ర రాజధాని అని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఆ ఓటమి నుంచి బయటపడి మార్పు తీసుకురావాలన్నారు.












Click it and Unblock the Notifications