Pawan Kalyan : వారాహి మూడో దశ టూర్ షెడ్యూల్ ఇదే-విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో..
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మూడో దశ నిన్న విశాఖపట్నం సిటీలో ప్రారంభమైంది. ఇక్కడి నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే యాత్ర కొనసాగించేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. ఇవాళ కూడా జనసేన నేతలతో భేటీ అయి దీనిపై ఆయన చర్చలు జరిపారు. అలాగే పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ నేతలతో చర్చించి వారాహి మూడో దశ యాత్ర షెడ్యూల్ ఖరారు చేశారు.
ఇవాళ ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ వారాహి మూడో దశ యాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రుషికొండను సందర్శిస్తారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. తర్వాత వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతం సందర్శిస్తారు.

అలాగే పవన్ 13న గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 14న ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు ఆక్రమణకు గురైన భూములు సందర్శిస్తారు. 15న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జనసేనాని హాజరు కానున్నారు. అనంతరం తిరిగి 16న విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలు సందర్శిస్తారు. 17న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఇంత వరకూ షెడ్యూల్ ఖరారు చేశారు.
ఇప్పటికే విశాఖ నగరంలో వారాహి యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఇవాళ రుషికొండ సందర్శనకు వెళ్లాల్సి ఉండగా.. జనసేన నేతలు ఈ మేరకు పోలీసుల్ని అనుమతి కోరారు. కానీ వారు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. అయినా రుషికొండ వెళ్లాలని భావించిన పవన్.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఆ తర్వాతే నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించి వారాహి యాత్ర మూడో దశ షెడ్యూల్ ను ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications