'ప్రజారాజ్యం'లో చేయలేనివి 'జనసేన'లో చేయబోతున్న పవన్ కల్యాణ్?
అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు జరిగిన పరిణామాలు, ఎన్నికల్లో పోటీకి అనుసరించిన నియమాలు తదితరాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రజారాజ్యం సమయంలో తమతోపాటు వెంట నడిచినవారికంటే అప్పటికప్పుడు సీటుకోసం పార్టీలో చేరినవారికి టికెట్లు ఇచ్చారు. చిరంజీవి అభిమానులకు, కార్యకర్తలకు ఆ ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కలేదు. 2009 ఎన్నికల్లో పోటీచేసిన ప్రజారాజ్యం 18 సీట్లు సాధించింది.

ప్రజారాజ్యానికి భిన్నంగా జనసేన
ప్రజారాజ్యానికి భిన్నంగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ భావిస్తున్నారు. ఎన్నికల్లో మొదటి నుంచి తనను నమ్ముకొని తనవెంటే నడిచినవారికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో జనసేన తరఫున అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొందరు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేనకు అభ్యర్థులు లేరు. తనకు బలమైన అభ్యర్థులున్న చోట, తన పార్టీకి బలమున్నచోటే పోటీచేయాలని జనసేనాని నిర్ణయించారు.

నమ్ముకున్నవారికే సీట్లు
ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి అభిమానులకు సీట్లిచ్చివుంటే పార్టీ స్థాయి మారేదని, అలా కాకుండా మధ్యలో వచ్చినవారికి సీట్లివ్వడంవల్ల మొదటినుంచి ఉన్నవారికి అన్యాయం జరిగిందని అప్పుడు కూడా పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం లోపాలను ఎత్తిచూపారు. జనసేన కోసం 10 సంవత్సరాల నుంచి తన వెంట నడుస్తున్నవారికి సీట్లివ్వడమే కాకుండా వారిని ఏయే నియోజకవర్గాల్లో పోటీచేయించాలనే విషయమై స్పష్టతతో ఉన్నారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.

ఎన్ని సీట్లిస్తారో?
తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే వీరందరినీ ప్రకటించాలని పవన్ భావిస్తున్నారు. గౌరవం తగ్గకుండా సీట్లడిగిన పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో? ఆ సంఖ్య తమకు నచ్చుతుందో? లేదో? గౌరవం తగ్గకుండా ఉండాలంటే తామడుగుతున్న సీట్లు ఇస్తారా? తదితర విషయాలన్నింటిపై ఒక స్పష్టతకు రావాలని భావిస్తున్నారు. టికెట్ల కోసం మధ్యలో పార్టీలోకి చేరేవాళ్లు చివరి వరకు పార్టీ కోసం నిలబడరని, ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని జనసైనికులు జనసేనానికి సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications