జనసేన నుంచి బయటికి క్యూ: మరో సీనియర్ నేత అవుట్
Janasena: తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమిలో తలెత్తిన అసంతృప్తి, చెలరేగుతున్న కల్లోలానికి పుల్‌స్టాప్ పడట్లేదు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఇది మరింత ఉధృతమౌతూ వస్తూనే ఉంది తప్ప తగ్గట్లేదు. పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోయిన నాయకులు వరుసగా పార్టీనీ వీడుతున్నారు. రాజీనామాలు చేస్తోన్నారు.
విజయవాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు పోతిన మహేష్.. సోమవారం నాడే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనసేనలో సుదీర్ఘకాలం నుంచి పని చేసిన ఆయన ఈ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమం నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు కానీ అది సాధ్యపడలేదు.

పొత్తులో భాగంగా ఈ సీటును భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఇక్కడి నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో పోతిన మహేష్.. జనసేనకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పంపించారు.
ఇదివరకు జనసేనకే చెందిన ముమ్మిడివరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజాబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారిద్దరూ ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు.
తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జి బుసనబోయిన వెంకటేశ్వరరావు అలియాస్ బీవీ రావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. క్రియాశీలక, ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు.
ఈ ఎన్నికల్లో కైకలూరు అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు బీవీ రావు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. పొత్తులో భాగంగా ఇప్పుడీ నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకుంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరు బరిలో నిలిచారు.












Click it and Unblock the Notifications