జగన్ ఏరి కోరి తెచ్చుకున్న నేత గుడ్ బై..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది. వైసీపీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యులతో పాటుగా పలువురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరం అయ్యారు. నాడు అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఏరి కోరి తెచ్చుకొని ఎమ్మెల్సీగా చేసిన క్రిష్ణా జిల్లాకు చెందిన మరో నేత పార్టీతో పాటుగా మండలి సభ్యత్వానికి రాజీనామా చేసారు. మరి కొందరు ఇదే బాట పడుతున్నారనే ప్రచారం వేళ వైసీపీ ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారు.
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణ వైసీపీకి రాజీనామా చేసారు. పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ మోషెన్‌రాజుకు పంపారు. 2009 లో ఆయన టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పొత్తులో భాగంగా గెలిచి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ సీటు ఇచ్చినా వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వర రావు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని వీడారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన జయమంగళం వెంకటరమణ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు స్థానిక కూటమి నేతలు ఆయనతో చర్చలు చేసినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసారు. వీటి పై ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ తాజా సమావేశాల్లో రాజీనామా చేసిన సభ్యులు ఆందోళన చేసారు. ఇక, ఇప్పుడు క్రిష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతల పైన కేసులు నమోదయ్యాయి. వారంతా మౌనంగా ఉన్నారు. మరి కొందరు వైసీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీంతో..ఇప్పుడు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications