తిరుమలలో జయలలిత అభిమానుల హంగామా, షాకిచ్చారు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు కొందరు జయలలిత అభిమానులు ఆమె చిత్రపటంతో నినాదాలు చేశారు. ఇది గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశారు.
ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. తమిళనాడు నుండి వచ్చిన పలువురు జయలలిత అభిమానులు.. ఆలయం ముందు ఆమె చిత్రపటాలను ప్రదర్శించారు. నినాదాలు చేశారు. అక్రమాస్తుల కేసులో తీర్పును సస్పెండ్ చేస్తూ కర్నాటక హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పలువురు జయలలిత అభిమానులు మొక్కు తీర్చుకునేందుకు వచ్చారు. వారు తమ మొక్కు తీర్చుకునే క్రమంలో భాగంగా కొంత హంగామా చేశారు. శ్రీవారి ఆలయం వద్ద జయలలిత ఫోటోలు చూపుతూ నినాదాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, గత సంవత్సరం కిందిస్థాయి కోర్టు అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితను దోషిగా తేల్చిన అనంతరం ఆమె జైలుపాలయ్యారు. తమ నేత జైలుపాలు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
అయితే మే 11న కర్ణాటక హైకోర్టు జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్ధోషిగా తేల్చింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తన కోసం ఆత్మహత్యలు చేసుకున్న 244 మందికి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని అన్నాడీఎంకే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబాలకు రూ.7 కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు పార్టీ శనివారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications