జేసీ బ్రదర్స్ దెబ్బకు.. నా 'ఖర్మ' అన్న ప్రత్యర్థి.. అల్లుడిని నెగ్గించేసుకున్నారు..
తొలుత సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించిన పైలా నర్సింహయ్య.. సీపీఐ అధిష్టానం ఆదేశించడంతోనే నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకోవడం గమనార్హం.
అనంతపురం: టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైనా సరే.. తమ అల్లుడు దీపక్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకోవడంతో పాటు ఏకగ్రీవంగా గెలిపించడంలోను జేసీ బ్రదర్స్ రాజకీయాలు ఫలించాయి. నిన్నటిదాకా సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణకు కుట్ర చేశారన్న సీపీఐ అభ్యర్థి పైలా నర్సింహయ్య సైతం అలాంటిదేమి లేదంటూ సర్దుకుపోయారంటే.. తెర వెనుక జేసీ రాజకీయాలు బాగానే పనిచేశాయని చెప్పుకుంటున్నారు.
కాగా, తొలుత సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించిన పైలా నర్సింహయ్య.. సీపీఐ అధిష్టానం ఆదేశించడంతోనే నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. పైగా జేసీ బ్రదర్స్ నుంచి తనకెలాంటి బెదిరింపులు ఎదురుకాలేదని, ఇదంతా 'నా ఖర్మ' అంటూ ఆయన తన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు.

ఇప్పటిదాకా టీడీపీ పార్టీ ఖాతాలో ఆరు శాసనమండలి స్థానాలు ఏకగ్రీవంగా వచ్చి చేరాయి. ఈ సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటం, బరిలో ఉన్నది టీడీపీ అభ్యర్థులే కావడంతో అనధికారికంగా వారు ఎన్నికైనట్లేనని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్. గ్రేట్ ఇండియన్ మైనింగ్, గ్రేట్ ఇండియా రాక్ మినరల్స్ వంటి సంస్థలకు యజమానిగా ఉన్నారు. 2012లో రాయదుర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా ఉన్నతవర్గానికి చెందిన నేత కావడంతో.. జేసీ బ్రదర్స్ ఒత్తిళ్లకు తలొగ్గి అధినేత చంద్రబాబు దీపక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు కేటాయించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications