రాజ్యసభపై సెల్ఫ్‌గోల్: వోల్వోతో జెసికి సీమాంధ్ర కాంగ్ నో
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించిన కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు, అనంతపురం జిల్లా మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి సరదాగా అయినా ఆయన చేసిన వ్యాఖ్యలు చేటు చేసేలా కనిపిస్తున్నాయి. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యవాదంతో దిగాలని జెసి నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ఆయన పలువురు సీమాంధ్ర శాసన సభ్యులతో సంతకాలు కూడా చేయించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావుతో నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ... ఓటేస్తే వోల్వో బస్సు ఇస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.

దీనిపై సీమాంధ్ర కాంగ్రెసు నేతలతో పాటు ఆయనకు మద్దతుగా సంతకాలు చేసిన వారు అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జెసి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను కెటిఆర్‌తో సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అయినప్పటికీ ఆ వివాదం చల్లారినట్లుగా కనిపించడం లేదు.
జెసిని ప్రతిపాదిస్తూ సంతకం చేసినందుకు తనకే ఇంకు ఖర్చయిందంటూ రౌతు సూర్యప్రకాశ రావు అన్నారు. జెసి వ్యాఖ్యలతో తమపై దురభిప్రాయం కలిగే అవకాశం ఉన్నందున ఆయనకు ఇచ్చిన మద్దతు లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు లేఖ ఇచ్చానని ఆయన తెలిపారు. జెసి తన వ్యాఖ్యల ద్వారా సెల్ఫ్‌గోల్ వేసుకున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications