దుఃఖంలో హ్యాపీ, కత్తుల్లేవు: జెసి, జీవన్‌రెడ్డితో వాగ్వాదం
హైదరాబాద్: దుఃఖంలో ఉన్న తమకు రాయల తెలంగాణ ప్రతిపాదన సంతోషకరమైన విషయమని అనంతపురం జిల్లా మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. గుడ్డిలో మెల్లలా తాము రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరిస్తున్నామన్నారు.
రాష్ట్ర విభజనతో కాంగ్రెసు పార్టీకి నష్టమే అన్నారు. రాయల తెలంగాణతో పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. అనంతపురం, కర్నూలు జిల్లాలోను తెలంగాణలో కలపితే కాంగ్రెసు పార్టీకి 20 నుండి 24 సీట్లు పెరుగుతాయన్నారు. ఇప్పటికే రాయలసీమ రైతులు దుర్భర స్థితిలో ఉన్నారని, తెలంగాణలో కలపకుంటే మరింత నష్టం జరుగుతుందన్నారు.

రాయలసీమ పైన తెలంగాణ ప్రాంత నేతలు చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. తమ వద్ద కత్తులు, కొడవళ్లు లేవన్నారు. అవన్నీ గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లాయన్నారు. రాయల తెలంగాణకు ఓకే చెప్పిన కొందరు ఇప్పుడు వ్యతిరేకించడం బాధాకరమన్నారు. ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేస్తే తమకు ఇంకా ఎలాంటి అభ్యంతరం లేదని, సమస్యే ఉండదన్నారు.
తెలంగాణ ప్రజలు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకించడం లేదని తెలిపారు. రెండు జిల్లాలను తెలంగాణలో కలిపితే రాజధాని సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలా అధిష్టానాన్ని ధైర్యంగా వ్యతిరేకించే వారు ఎవరున్నారని ప్రశ్నించారు.
జెసి వర్సెస్ జీవన్ రెడ్డి
సిఎల్పీలో విభజన విషయంలో జెసి, మరో కాంగ్రెసు సీనియర్ నేత జీవన్ రెడ్డిల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. విభజన అంశం చర్చకు వచ్చినప్పుడు తాను సమైక్యవాదినని, విభజన తప్పని పరిస్థితుల్లో తాను రాయల తెలంగాణ కోరుకుంటానని జెసి చెప్పారు. రాయల టికి తాము అంగీకరించేది లేదని జీవన్ రెడ్డి అన్నారు. రాయల టికి అంగీకరించాలని జెసి కోరగా జీవన్ రెడ్డి నో చెప్పారు. 371 డి ఆర్టికల్ పైన వారి మధ్య చర్చకు వచ్చింది.












Click it and Unblock the Notifications