అధిష్టానానికి జెసి లేఖ: గంటాకి షోకాజ్? దానం ఆగ్రహం
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం పంపించిన షోకాజ్ నోటీసుకు సంబంధించి మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం పిసిసికి లేఖ పంపించారు. తాను అసెంబ్లీ సమావేశాలు ముగిశాక షోకాజ్ పైన వివరణ ఇస్తానని జెసి ఆ లేఖలో పేర్కొన్నారు.
గంటాకు షోకాజ్?
మంత్రి గంటా శ్రీనివాస రావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లుగా ప్రచారం సాగుతోంది. గంటా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ నేపథ్యంలో గంటాకు రెండు రోజుల్లో షోకాజ్ ఇవ్వవచ్చునని అంటున్నారు.

దానం ఆగ్రహం
సీమాంధ్ర నేతలపై మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సీమాంధ్ర నేతల రాజకీయ దుకాణం బంద్ అవుతుందని, సీమాంధ్ర నేతలు కిరాణా కొట్టు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. అదే సమయంలో కరీంనగర్ ఎంపీ పొన్నం వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన పొన్నం వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీస్తాయన్నారు.
తిరుమలలో అశోక్ బాబు దిష్టి బొమ్మ దహనం
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తీరుపై సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం తిరుమలలో అశోక్‌బాబు దిష్టి బొమ్మను నేతలు దహనం చేశారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చాక ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్న అశోక్ బాబు ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం తిరుగుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications