మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో వివాదం.. కోడలి కారు ప్రమాదం, ఫిర్యాదుతో ట్విస్ట్!
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్ కుటుంబం చుట్టూ తాజాగా మరో కొత్త వివాదం చోటు చేసుకుంది. ఈ నెల 15న ఆయన కోడలు జోగి మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడ వైపు కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదం వెనుక కుట్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ రోజు వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. మరుసటి రోజు అంటే 16న కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ ప్రమాదం వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ అనుమానాలకు జోగి రమేష్ కుటుంబంతో వివాదం ఉంది. కేవలం మూడు నెలల క్రితం మేఘన తన భర్త రాజీవ్, మామ జోగి రమేష్, అత్త శకుంతలతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని, హత్యాయత్నం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. 2025 మేలో జరిగిన వివాహానికి తన తల్లిదండ్రులు సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశారని, బంగారం, వెండి, నగదు ఇచ్చినా అదనంగా మరో రూ.5 కోట్లు, ఫార్చ్యునర్ కారు, వజ్రాల నగలు డిమాండ్ చేస్తున్నారని ఆమె చెప్పారు.
గోవా పర్యటనలో, ఘట్కేసర్ ఫార్మ్‌హౌస్‌లో, ఇంట్లోనూ తనను చంపే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఆ కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ నేపథ్యంలోనే కారు ప్రమాదం జరగడంతో మేఘన కుటుంబం ఇది సాధారణ ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేయించిన దాడి కావచ్చని అనుమానిస్తోంది.
పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు ప్రాథమిక పరిశీలనలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనేనని, ఇప్పటివరకు ఉద్దేశపూర్వక కుట్రకు స్పష్టమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. అయినా అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ వివాదం కుటుంబ సమస్యగా మొదలై రాజకీయ చర్చకు దారి తీస్తోంది.













Click it and Unblock the Notifications
