వైసీపీలోకి జూపూడి రీ ఎంట్రీ..ఆకుల సైతం చేరిక: నేడే ముహూర్తం.. జగన్ సమక్షంలో..!
Recommended Video
దసరా నాడు వైసీపీలోకి ఇద్దరు నేతలు రావాలని నిర్ణయించారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ టీడీపీ నుండి తిరిగి వైసీపీలో చేరుతున్నారు. అదే విధంగా జనసేన కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సైతం వైసీపీలో చేరుతున్నారు. మరి కాసేపట్లో వారిద్దరూ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు నుండి ఆయన తో పాటు ఉన్న జూపూడి ప్రభాకర్ 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు.

జూపూడి ప్రభాకర్
ఆ సమయంలో ఆయన పార్టీలో సీనియర్ నేత మీద ఆరోపణలు చేసారు. ఆయన కారణంగానే తాను ఎన్నికల్లో ఓడానని విమర్శించారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారు. అక్కడ ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకుండా ఆయన నామినేటెడ్ పదవి అప్పగించారు. టీడీపీ లో ఉన్న సమయంలో వైసీపీ మీద.. జగన్ మీద జూపూడి అనేక ఆరోపణలు చేసేవారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిన తరువాత జూపూడి ప్రభాకర్ యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం టీవీల్లో చర్చలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. టీడీపీ నుండి బయటకు రావాలని ఆయన కొద్ది రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే..బీజేపీలో చేరే అంశం మీద చర్చ సాగింది. కానీ, ఆయన సన్నిహితులు వైసీపీలోకి వెళ్లాలని సూచించటంతో తిరిగి వైసీపీ నేతలతో చర్చలు చేసారు. తొలుత జగన్ అభ్యంతరం వ్యక్తం చేసినా..పార్టీ నేతల సూచనతో చివరకు అంగీకరించారు.

ఆకుల సత్యనారాయణకు కీలక బాధ్యతలు..
2014 ఎన్నికల్లో బీజేపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకుల సత్యనారాయణ 2019 ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయనతో పాటుగా ఆయన సతీమణి సైతం జనసేనలో చేరారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పైన ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసారు. తిరిగి బీజేపీలోకి వెళ్లాలని భావించినా..ఆయన తన సతీమణితో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రితో సన్నిహిత సంబందాలు ఉన్న ఆకుల సత్యనారాయణ తన సతీమణితో పాటుగా అనుచరులతో కలిసి వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి గ్రీన సిగ్నల్ ఇవ్వటం దసరా రోజున ముహూర్తంగాగా నిర్ణయించుకున్నారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు
ఆయనకు ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అదే విధంగా విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి నాయుడు సైతం వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన చేరిక పైన ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఆదివారం నాడే ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా..వాయిదా పడింది. రానున్న రోజుల్లో కాపు వర్గానికి చెందిన నేతలు మరి కొంత మంది ఉభయ గోదావరి జిల్లాల నుండి వైసీపీలో చేరటానికి సిద్దంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications