జగన్ చుట్టూ ఉచ్చు- ధనంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్
AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే ధనంజయ రెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పని చేశారు.
ఇప్పుడు వీరిద్దరూ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతోన్న మద్యం కుంభకోణం కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32గా ఉన్నారు.

దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
గతంలో విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీకి చెందిన కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి.. సిట్ విచారణకు హాజరయ్యారు కూడా. తమ వివరణలను ఇచ్చుకున్నారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.
ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. మూడు రోజుల పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేసుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వాళ్లు దాఖలు చేసుకున్న పిటీషన్ ను కొట్టివేసింది.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ తో కూడిన ధర్మాసనం ఈ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరఫున సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వి, వికాస్ సింగ్, సిద్ధార్థ్ దవే తమ వాదనలను వినిపించారు. ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్లు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.
ఈ కేసును రాజకీయ కుట్రపూరితమైనదిగా అభివర్ణించారు. మద్యం కేసులో వీళ్ల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవనీ అన్నారు. మద్యం కుంభకోణం కేసు కీలక దశలో ఉన్న సమయంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం వల్ల విచారణ పక్కదారి పట్టడానికి అవకాశం ఉంటుందని ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.
తమ పలుకుబడిని ఉపయోగించి మద్యం కుంభకోణం సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ ఇస్తే- దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తేల్చి చెప్పారు. ముందస్తు బెయిల్ ను మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిన విషయాన్ని జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనానికి వివరించారు.
ప్రభుత్వం తరపున న్యాయవాదుల వాదనలతో జేబీ పార్దీవాలా ధర్మాసనం ఏకీభవించింది. ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. ఈ పిటీషన్ కొట్టివేతకు గురైన గంటల వ్యవధిలోనే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం.. దీని తీవ్రతకు అద్దం పడుతోంది.












Click it and Unblock the Notifications