కరోనాతో గేమ్స్: పరీక్షల వాయిదా కోసం అత్యుత్సాహంతో ..: నలుగురు విద్యార్థులు సస్పెండ్
కడప: ప్రాణాంతక కరోనా వైరస్ ఏ రేంజ్‌లో జనాన్ని భయాందోళనలకు గురి చేస్తోందో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలను లోలోపలే కొరుక్కుని తినేసిందో కూడా తెలిసిన విషయమే. అగ్రదేశాలను సైతం వణికిస్తోంది మహమ్మారి. భయానకంగా విస్తరిస్తోంది. దీన్ని ఎలా అరికట్టాలో తెలియక తలపట్టుకుంటున్నాయి ప్రపంచదేశాలు. అలాంటి కరోనాను కూడా వదల్లేదు నలుగురు విద్యార్థులు. కరోనా వ్యాపించిందంటూ పుకార్లను పుట్టించారు. అంతే- సస్పెన్షన్‌కు గురయ్యారు. పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు.
కడప జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇది. కడప నగర శివార్లలోని గ్లోబల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కరోనా వైరస్ వ్యాపించిందంటూ నలుగురు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా పుకార్లను పుట్టించారు. కొంతమంది విద్యార్థులు, సిబ్బందిలో వైరస్ లక్షణాలు కనిపించాని ప్రచారం చేశారు. దీని ఆధారంగా ఒకట్రెండు మీడియా సంస్థలు కథనాలను కూడా ప్రసారం చేశాయి. ఈ వార్తల పట్ల కళాశాల యాజమాన్యం ఉలిక్కిపడింది. దీనిపై విచారణకు ఆదేశించింది.

అదంతా తప్పుడు సమాచారమని తేలింది. సీ శ్రావణ్ కుమార్, కే గణేష్ కుమార్, ఏ జయరామ్, కేఎం వరుణ్ కుమార్ అనే విద్యార్థులు దీనికంతటికీ కారణమని నిర్ధారించుకుంది కళాశాల యాజమాన్యం. పరీక్షలను వాయిదా వేయించాలనే ఉద్దేశంతో ఈ నలుగురు విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా పుకార్లను పుట్టించినట్లు స్పష్టమైంది. దీనితో ఆ నలుగురినీ సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నలుగురు విద్యార్థులపై న్యూసెస్స్ కింద చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications