కడప బాలిక గ్యాంగ్ రేప్: వారిపై పోక్సో కేసులు; ఆ వార్తల్లో నిజంలేదు: ఎస్పీ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్సార్ కడప జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారింది. ఈ ఘటనపై పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని, ఈ విషయం బయటకు రాకుండా చూడాలని ప్రయత్నం చేశారని వార్తలు రావడంతో ప్రతిపక్ష పార్టీలకు ఈ వ్యవహారం ఆయుధంగా మారింది.పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువగా మారాయి.
దీంతో ప్రొద్దుటూరు అత్యాచార కేసుపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మాట్లాడారు. కేసు నమోదు చేయలేదని వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. మైనర్ బాలికపై ఆత్యాచారం ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. మతిస్థిమితం లేక బిచ్చమెత్తుకుని జీవిస్తున్న బాలికను అత్యాచారం చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. ఆరు నెలల క్రిందట ఆ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని, 4 నెలల కిందట మరో ఇద్దరు బాలికపై అత్యాచారం చేశారని పేర్కొన్న ఎస్పి బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు.

ఘటనపై పూర్తి స్థాయి విచారణకు అదనపు ఎస్పి పూజితను ఆదేశించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ప్రొద్దుటూరు వెళ్లి విచారణ చేస్తున్నారని తెలిపారు. బాలికను డాడీ హోమ్ కు తరలించి విచారణ మొదలు పెట్టామని పేర్కొన్న ఎస్పి, బాలిక వద్ద 164 స్టేట్మెంట్ నమోదు చేయడానికి ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరచనున్నామని వెల్లడించారు. కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు.
ఫిర్యాదు అందిన వెంటనే ప్రొద్దుటూరు పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారన్నారు. ఇంట్లో పని కోసం అని చెప్పి బాలికను తీసుకువెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. బాలిక ప్రియుడు అని చెబుతున్న శంభుని కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని విడిచిపెట్టేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ అన్బు రాజన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications