సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి- రిట్ పిటిషన్ పై హైకోర్టుకు వైఎస్ సునీత కీలక విజ్ఞప్తి !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని నిన్న తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తననూ ఇంప్లీడ్ చేయాలని వైఎస్ సునీత కోరారు.
ఏపీలో నాలుగేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ మూడోసారి హైదరాబాద్ లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ తాజాగ నోటీసుల నేపథ్యంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్.. విచారణ ప్రారంభం కాకపోవడంతో లాయర్ల సూచన మేరకు సీబీఐ విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) విచారణాధికారి (సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ) సరైన విధానాల్లో తనను విచారించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని రిట్ పిటిషన్లో కోరారు. తనను సీబీఐ తొలిసారి విచారించిన తర్వాత విపక్షాలు, ఓ వర్గం మీడియా తనపై ఉన్నవీ, లేనివీ కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే వివేకా కేసులో గంగిరెడ్డి తనకు చెప్పారంటున్న దస్తగిరి వాంగ్మూలం మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సీబీఐ సేకరించలేదన్నారు. అలాగే తన విచారణ లాయర్ సమక్షంలోనే జరగాలని కూడా కోరారు.
మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి గతవారమే విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే అప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాల వల్ల పదో తేదీన వస్తానని అవినాష్ సీబీఐని కోరారు. దీంతో ఇవాళ విచారణకు రావాలని మరో నోటీసు ఇచ్చింది. అలాగే తండ్రి భాస్కర్ రెడ్డిని ఎల్లుండి విచారణకు రావాలని నోటీసులిచ్చింది. అలాగే హైకోర్టులో తన రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని సీబీఐకి అవినాష్ రెడ్డి మెయిల్ ద్వారా అభ్యర్ధించినట్లు తెలిసింది. అయితే అటు హైకోర్టు కానీ, ఇటు సీబీఐ కానీ స్పందించకపోవడంతో ఆయన ఇవాళ హైదరాబాద్ లో మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
మరోవైపు హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్లో తననూ ఇంప్లీడ్ చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి హైకోర్టుకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణను ప్రశ్నిస్తూ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ పై తనకు అభ్యంతరాలు ఉన్నాయని ఆమె హైకోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు సునీత విజ్ఞప్తిపై తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారింది. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్లలో ఇంప్లీడ్ అవుతూ క్రియాశీలకంగా ఉన్న సునీత.. హైకోర్టు అంగీకరిస్తే ఈసారి విచారణలో కూడా భాగస్వామి కానున్నారు.












Click it and Unblock the Notifications